కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణా క్యాబినెట్ !

 

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. నిన్న కేసీఆర్ అధ్యక్యతన ఐదు గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక బిల్లులకి ఆమోదం తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ఈరోజు రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈరోజున అసెంబ్లీ, రేపు మండలి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో నిన్న భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ కొత్త మున్సిపల్ బిల్లుకు ఆమోదం తెలిపింది. 

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. 1965 తెలంగాణ మున్సిపల్ చట్టం, 1994 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల స్థానంలో కొత్త బిల్లుకు రూపకల్పన చేశారు. నూతన మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆగష్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. 

కాగా మున్సిపల్ బిల్లుకు తుది రూపు ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖ సమీక్షకు పంపారు. ఇప్పటి వరకూ 65 ఏళ్లు వచ్చిన వారికే వృద్ధాప్య ఫించన్లను అందజేస్తున్నారు. కానీ ఫించన్లకు వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తామని ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా 57 ఏళ్లు దాటిన అర్హుల జాబితాను రూపొందించి పింఛను అందజేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. 

అలాగే బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని కూడా తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. బుధవారం వరకు పీఎఫ్‌ అకౌంట్ ఉన్న వారికి పింఛన్ అందించాలని ఆదేశించింది. పెంచిన పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను జూలై 20 నుంచి లబ్ధిదారులకు అందించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.ఈరోజు అసెంబ్లీలో ఈ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.