సభలో మాట్లాడలేని ప్రతిపక్షాలు మీడియా పాయింట్ కే పరిమితమా?

అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా… ఎందుకు? ప్రజా సమస్యలపై చర్చ చేయటానికి! ఇంకా ముఖ్యంగా, ప్రతిపక్షం జనం గొంతుని ప్రభుత్వానికి వినిపించటానికి… చట్ట సభలు ఉపయోగపడతాయి! ఊరికే చట్టాలు , తీర్మానాలు అమోదించుకోటానికి మాత్రమే సభలు ఏర్పాటు చేయబడలేదు. కాని, చాలా ఏళ్లుగా మన దేశంలో చట్ట సభల్లో చర్చ కంటే ఎక్కువగా రచ్చ జరుగుతోంది. కొన్ని సార్లైతే అది కూడా లేకుండా కథ కానిచ్చెస్తున్నారు పాలకులు! తాజాగా భూ సేకరణ చట్టానికి మార్పులు, చేర్పుల విషయంలో తెలంగాణ అసెంబ్లీలో అదే జరిగింది!

 

ఒక్కసారి మనం కాస్త వెనక్కి వెళితే 2014లో పార్లమెంట్ సమావేశాలు గుర్తుకు వస్తాయి. అక్కడ తెలుగు ప్రాంతాన్ని రెండు రాష్ట్రాలుగా విడదీసే అతి కీలకమైన విభజన బిల్లు ఎంపీలు అమోదించారు. కాని, ఎలాంటి చర్చ మాత్రం జరగలేదు లోక్ సభలో. రాజ్యసభలో తీవ్ర గందరగోళం మధ్య కొంత చర్చ నడిచింది. వ్యవహారం మొత్తం కొన్ని గంటల వ్యవధిలో పూర్తైపోయింది. చివరగా చూస్తే అధికారంలో వున్న వారు బలప్రయోగం చేసి బిల్ చేశారనీ అర్థమైపోయింది. అయితే, విభజన బిల్లుకు ఎలాగూ మద్దతు లభించేదే… కాని, అప్పటి యూపీఏ సర్కార్ అర్థవంతమైన చర్చ తరువాత బిల్ పాస్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాల తీరు కూడా అలానే వుంటోంది చాలా సందర్బాల్లో!

 

చట్ట సభల్లో చర్చ అనగానే రాజకీయ యుద్ధంలా మారిపోయింది ఈ మధ్య పరిస్థితి. భౌతిక దాడుల దాకా వెళ్లిపోతున్నారు నేతలు. మైక్ లు విరగొట్టడం, పేపర్లు చించటం అయితే సర్వ సాధారణంగా మారిపోయింది. ఇంతే తప్ప ఆ రోజు ఎన్నుకున్న అంశంపై నిజాయితీగా మాట్లాడే ఉద్దేశం పాలక, ప్రతిపక్షాలు ఇద్దరిలోనూ కనిపించటం లేదు. అందుకే, బిల్లో , తీర్మానమో, సవరణ పాస్ చేయించుకోవాలనుకున్న అధికార పార్టీలు గందరగోలం జరిగితేనే బెటర్ అనుకుంటున్నాయి. చర్చ లేకుండా, జనానికి ఎలాంటి అవగాహన కల్పించే అవసరం లేకుండా తమ పని పూర్తి చేసుకుంటున్నాయి!

 

భూ సేకరణ బిల్ లో కొద్దిపాటి సవరణలు సంకల్పించారు కేసీఆర్. స్పష్టమైన మెజార్జీ వున్న ఆయనకి ఇది పెద్ద సవాలేం కాదు. అయితే, చిక్కంతా అసలు ఏ మాత్రం చర్చకు అవకాశం లేకుండా టీఆర్ఎస్ సర్కార్ బిల్ పాస్ చేసుకోవటంతోనే వస్తోంది. ప్రతిపక్షాలు మాట్లాడటానికి కొంచెం కూడా టైం ఇవ్వకుండా పది, పదిహేను నిమిషాల్లో సభ ముగించటం జనంలోకి ఎలాంటి సంకేతాలు పంపుతుంది? బయట మార్కెట్లో మిర్చీ రైతులు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకపోవటం… ఒక విధంగా గవర్నమెంట్ ఢిపెన్స్ లో పడ్డట్టుగానే భావిస్తారు పబ్లిక్. అంతే కాదు, కాంగ్రెస్ సభ్యులకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. బీజేపీ, టీటీడీపీ నేతలు సస్పెన్షన్లో వున్నారు. ఇక మిగిలింది బిల్ కు మద్దతు తెలిపే టీఆర్ఎస్ సభ్యులు. వారితోనే చర్చ అంటూ లేకుండా బిల్ పాస్ చేసేశారు!

 

అసెంబ్లీల్లోని రాష్ట్ర ప్రభుత్వాలైనా, పార్లమెంట్లోని కేంద్ర ప్రభుత్వమైనా తమ పంతం ఎలాగూ నెగ్గించుకుంటాయి. ఆ క్రమంలో కనీసం ప్రతిపక్షం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవటం అప్రజాస్వామికం అవుతుంది. అలా కాకుండా అభిప్రాయాలు సభ ముందు పెట్టే అవకాశం సభ్యులందరికీ ఇచ్చి ఆ పై ప్రభుత్వాలు తమ నిర్ణయాలు అమల్లోకి తెస్తే బావుంటుంది. మరో వైపు ప్రతిపక్ష సభ్యులు కూడా మాట్లాడే అవకాశాన్ని చర్చ కోసం వాడితేనే బావుంటుంది. రచ్చ చేయటానికి, సత్తా చాటటానికి వాడుకుంటే జనానికి చట్ట సభలపై ఆసక్తి, నమ్మకం రెండూ పోతాయి…