మిర్చీ ఘాటు… రాజకీయ గాటు!

మిర్చీ లాంటి హీరో ప్రభాస్ నటించిన హాట్ మూవీ బాహుబలి! రిలీజైంది. కో్ట్లు కొల్లగుడుతోంది. వెయ్యి కోట్ల టార్గెట్ పెద్ద కష్టమేం కాదు కూడా! కాని, అదే సమయంలో మిర్చీ రైతుల మార్కెట్ కష్టాలు చూశారా? బాహుబలికి, మిర్చీ మద్దతు ధరకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? వుంది! అదే మార్కెటింగ్! బాహుబలి లాంటి సినిమా అద్భుతమైన మార్కెటింగ్ తో కావాల్సినంత , రావాల్సినంత కలెక్షన్స్ కొల్లగొట్టింది. టికెట్ ధర పెంచుకుంటామంటే… కోర్టు కూడా ఓకే చేసింది! కాని, నిత్యావసర ఆహార పదార్థమైన మిర్చీకి మాత్రం మద్దతు ధర లేదు. ప్రభుత్వం స్పందించటం లేదు. రైతులు ఆగ్రహానికి లోనై దాడులు సైతం చేస్తున్నారు. అయినా మిర్చీ ఘాటు ఎవ్వరికీ తగులుతున్నట్టు కనిపించటం లేదు!

 

మద్దతు ధర కష్టాలు కేవలం మిర్చీ రైతులకో, తెలంగాణ రాష్ట్రానికో సంబంధించినవి కావు. దేశ వ్యాప్తంగా రైతులందరి గోడు ఒకేలా వుంటోంది. అన్ని రాష్ట్రాల్లో ఎప్పుడో అప్పుడు మద్దతు మంటలు మండుతున్నాయి. రైతులు చివరకు ఆత్మహత్యలు చేసుకునే దాకా పరిస్థితి వెళుతోంది! ఎందుకిలా? ఒక సినిమా, ఒక సబ్బు, ఒక సిగరెట్, ఒక మద్యం బాటిల్… అన్నీ గిట్టుబాటు అయ్యేలా అమ్ముకోవచ్చు! కాని, బతకటానికి కావాల్సిన తిండికి మాత్రం మద్దతుండదు! రైతుకి మద్దతు ధర దొరకదు! ఇది అత్యంత విషాదం…

 

తెలంగాణ సీఎం కేసీఆర్, మిర్చీ రైతుల దాడిని కుట్రగా పేర్కొన్నారట. రైతులు కాదు… ఎవరో రాజకీయ దురుద్దేశంతో ఆ పని చేయించారని అన్నారట. అది నిజం కావచ్చు. ప్రభుత్వంపై కోపంతో రైతుల్ని అడ్డుపెట్టుకోవచ్చు. మొన్నటికి మొన్న తమిళ రైతుల్ని కూడా దిల్లీ రోడ్ల మీద వదిలేశారు చెన్నై రాజకీయ పెద్దలు. మోదీ పట్టించుకోరనీ తెలిసీ కూడా తమిళ రైతుల్ని అక్కడ వుండనిచ్చారు. తీరా తమ రాజకీయ సంక్షోభాలు తీరాక పళనిస్వామి వచ్చి మాటిచ్చి స్వరాష్ట్రం తీసుకెళ్లారు. ఇదంతా అనుమానాస్పదంగానే జరిగింది!

 

కొన్ని చోట్ల రైతుల సమస్యలు అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న మాట వాస్తవం. కాని, అదే సమయంలో రైతుల సమస్యలు అంతకంటే వాస్తవం. రైతు పండించిన ఆహారం లేకుంటే ఏమున్నా ఏం లాభం? సినిమాలు, ఐపీఎల్ మ్యాచ్ లు ప్రాణాలు కాపాడలేవు కదా? అయినా ప్రాణాలు నిలిపే అత్యంత ముఖ్యమైన వాటిని మన పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతీ వారంలో తప్పక కనిపించే వార్త కిసానో, జవానో చనిపోయాడనే తప్ప మరొకటి కాదు! ఇది మొత్తం వ్యవస్థకే ప్రమాదకరం. అభివృద్ధి చెందుతోన్న భారతదేశం రైతులు, సైనికుల్ని కోల్పోయి ఎప్పటికీ అగ్ర రాజ్యంగా ఎదగలేదు!

 

జవాన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, కిసాన్ ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ఆలోచనలు పక్కన పెట్టి నిజాయితీగా కృషి చేయాలి. మిర్చీ మొదలు పసుపు వరకూ ఏ పంటకైనా రైతు కోరిన మద్దతు ధర ఇవ్వటం మన ప్రభుత్వాలకి పెద్ద పనేం కాదు, వేల కోట్ల లోన్లు, వందల ఎకరాల భూములు అభివృద్ధి పేరుతో ధారదత్తం చేసే సత్తా వున్నప్పుడు అన్నదాతకి డబ్బులెందుకు వుండవు? మనసుంటే మార్గముంటది! అంతకన్నా ముఖ్యంగా, అయిదేళ్లకోసారి దేశంలోని అన్ని పార్టీలు, అందరు నేతలూ ఎన్నికలు ఎదుర్కోవాల్సిందే! అప్పుడు రైతు మాత్రమే కాదు… ఓటర్ కూడా అవుతాడు!