కౌశిక్‌రెడ్డి వెనుక కాంగ్రెస్ నేత.. రేవంత్‌కు చెక్ పెట్టేందుకేనా?
posted on Sep 15, 2024 11:35AM
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కాస్తా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గొడవగా మారింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరును బీఆర్ఎస్‌లోని కొందరు నేతలు సైతం తప్పుబడుతున్నారు. అరెకపూడి గాంధీని ఉద్దేశిస్తూ ఆంధ్రోడు అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం వెనుక మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని, ఆంధ్రా వాళ్లను రెచ్చగొట్టి తెలంగాణ వాదంతో మళ్లీ పబ్బం గడుపుకోవాలని కేసీఆర్ చూస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
కౌశిక్ రెడ్డి దూకుడుగా వ్యవహరించటానికి కేసీఆర్ అండదండలు ఉన్నాయో లేదో కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి ప్రమేయం మాత్రం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని తెరపైకి తేవడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేసేయడానికి చాన్స్ ఉంటుందని ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి... కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపారని కాంగ్రెస్ లోని కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కౌశిక్ రెడ్డికి అండగాఉన్న మంత్రి ఎవరు? అనే విషయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీల నేతలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం.. పీఏసీ చైర్మన్ పదవిని అప్పటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కి ఇవ్వకుండా ఎంఐఎం పార్టీకి అప్పగించింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మెజార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఆ కారణంగానే ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం పీఏసీ చైర్మన్ పదవి కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అప్పటికే పీఏసీ చైర్మన్ పదవికోసం బీఆర్ఎస్ హరీష్ రావు పేరు ప్రతిపాదించింది. ప్రభుత్వం గాంధీకి పదవిని ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడమే కాకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
గాంధీ కూడా పీఏసీ చైర్మన్ పదవికి దరఖాస్తు చేసుకున్నారని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతోనే గాంధీకి ఆ పదవిని కట్టబెట్టామని ప్రభుత్వం చెబుతున్నది. గాంధీ సైతం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ ను వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ఇరకాటంలోకి నెట్టేసింది. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి గాంధీ ఇంటికి వెళ్తా.. బీఆర్ఎస్ కండువా కప్పుతానని సవాల్ చేశాడు.. ప్రతిగా గాంధీ స్పందిస్తూ.. నువ్వు రాకుంటే నేనే నీ ఇంటికి వస్తా అంటూ బదులిచ్చాడు. వీరిద్దరి సవాళ్లతో రచ్చ మొదలైంది.
కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ సవాళ్లతో పోలీసులు అప్రమత్తమై ఇరువురి నేతల ఇండ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోవడంతో గాంధీనే తన అనుచరులతో కొండాపూర్‌లోని కౌశిక్ నివాసం వద్దకు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య కౌశిక్ నివాసంపై రాళ్లదాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు గాంధీని, ఆయన అనుచరులను అరెస్టు చేశారు. ఆ తరువాత హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లి గాంధీ, ఆయన అనుచరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయంతోనే గాంధీ దాడికి పాల్పడ్డారంటూ విమర్శించారు. అయితే, కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రోడు అంటూ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఈ వివాదం కాస్త తెలంగాణ, ఆంధ్రా వివాదంగా మారింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నారని.. మరోసారి ఆంధ్రావాళ్లను తిట్టడం ద్వారా తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సక్రమంగా సాగనివ్వకుండా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి మాత్రం ఉన్నారనీ, రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీనుంచి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ లోని కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ వ్యక్తి ఎవరనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ మంత్రి ఉన్నారని తెలంగాణ బీజేపీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. కౌశిక్ రెడ్డికి అభయం ఇస్తున్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలి ఉన్న బొమ్మను కార్టూన్ రూపంలో విడుదల చేసింది. ఈ కార్టూన్ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి దగ్గరి బంధువు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ మనిషిగానే కౌశిక్ రెడ్డి వ్యవహరించారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డిపై వీలుచిక్కినప్పుడల్లా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీనికితోడు ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటూ సంభోదించారు. అంతటితో ఆగకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, తన నాలుకపై నల్లటి మచ్చలు కూడా ఉన్నాయని.. తాను ఏమి అంటే అది జరిగి తీరుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లోని వర్గ విబేధాలను బహిర్గతం చేశాయి. తనకు మంత్రి పదవి దక్కలేదని రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారని టాక్ నడుస్తోంది. మొన్న రాజగోపాల్ రెడ్డి, నేడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉత్తమ్ ఉన్నారని, రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి దింప్పేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కౌశిక్ రెడ్డి వివాదం కాంగ్రెస్ లో విభేదాలను బహిర్గతం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.