గెలిచి పరువునిలుపుకున్న టీమిండియా
posted on Oct 1, 2012 4:28PM

కొలంబోలో జరిగిన టి20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు మరోసారి సత్తాని చాటి విజయభేరీ మోగించారు. పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించడంద్వారా సెమీ ఫైనల్ ఆశల్ని సజీవంగా నిలబెట్టారు. ఆసాంతం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్ల ధాటికి పాక్ బౌలర్లు, బ్యాట్స్ మెన్ నిలవలకపోయారు. మొదట బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ ఆటగాళ్లను భారత్ బౌలర్లు ఆలౌట్ చేశారు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ బ్యాట్స్ మెన్ సత్తాని చాటి ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించిపెట్టారు. సయ్యద్ అజ్మల్ సహా పాకిస్తాన్ బౌలర్లెవరూ విరాట్ కోహ్లీపై ప్రభావం చూపలేకపోయారు. పాకిస్తాన్ 19.4 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటయ్యింది. షోయబ్ మాలిక్ 28 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఉమర్ అక్మల్ 21 పరుగులు సాధించాడు. లక్ష్మీపతి బాలాజీ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్, యువరాజ్ సింగ్ చెరో రెండు వికెట్లను చేజిక్కించుకున్నారు. బ్యాటింగ్ మొదలుపెట్టిన కొద్ది క్షణాల్లోనే భారత్ గౌతమ్ గంభీర్ వికెట్ ని కోల్పోవాల్సొచ్చింది. వీరేందర్ సెహవాగ్ తో కలిసి చెలరేగి ఆడిన విరాట్ కోహ్లీ పాక్ బౌలర్ల గుండెల్లో బాంబులు పేల్చాడు. సెహ్వాగ్ 29 పరుగులకే వెనక్కి తిరిగినా మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీమాత్రం జట్టుని విజయతీరాలకు చేర్చాడు.