పోరాటం ఆగదంటున్న టీడీపీ

రాష్ట్రానికి అన్యాయం చేసారంటూ ఎన్డీయే నుండి బయటికొచ్చి నాలుగేళ్ళ బంధాన్ని తెంచుకున్న టీడీపీ.. ఇప్పుడేకంగా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది.. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ సమావేశాల మీద ఉంది.. టీడీపీ మాత్రం ఏం జరిగినా పోరాటం ఆగదని స్పష్టం చేస్తుంది.

 

 

తాజాగా ఈ విషయంపై మాట్లాడిన టీడీపీ ఎంపీలు.. దేశంలోని వివిధ పార్టీల నేతలను కలిసి, రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం గురించి వివరించామని.. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి వివిధ పార్టీల మద్దతు కూడగట్టామని చెప్పారు.. విభజన హామీలు సాధించే వరకు పోరాటం చేస్తామని.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌ వేదికగా నిలదీస్తామని.. సభ నుంచి సస్పెండ్‌ చేసినా తమ పోరాటం ఆగదని ఎంపీలు స్పష్టం చేసారు.. మరోవైపు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది..  తాను ఢిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటానని, సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని, ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని, రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించాలని చెప్పినట్టు తెలుస్తోంది.