బీజేపీలో టీడీపీ విలీన ప్రక్రియ పూర్తి!!

 

రాజ్యసభలో బీజేపీలోకి టీడీపీ విలీన ప్రక్రియ పూర్తయింది. గురువారం సుజనాచౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్‌రావు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆపార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. మొత్తం ఆరుగురు ఎంపీల్లో నలుగురు బీజేపీ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా టీడీపీ పక్షాన్ని విలీనం చేస్తున్నట్లుగా చేసిన తీర్మాన లేఖను రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి గురువారం అందజేశారు. ఆ వెంటనే టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకుంటున్నామని పేర్కొంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖను బీజేపీ నేతలు ఉపరాష్ట్రపతికి ఇచ్చారు. ఈ రెండు లేఖలపై ఆయన వెంటనే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలోకి టీడీపీ విలీన ప్రక్రియకు ఆమోదముద్ర వేశారు. దీంతో రాజ్యసభ రికార్డుల్లో పార్టీల వారీ జాబితాలో మార్పులు చేశారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావు బీజేపీ సభ్యులుగా రాజ్యసభ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. నలుగురు సభ్యుల చేరికతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 75కు చేరింది.