సంక్షోభాలను అధిగమించి.. సమున్నతంగా నిలిచి..!

తెలుగుదేశం పార్టీ  ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది.  అంతే కాదు  జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం.  జగన్ కక్ష పూరిత రాజకీయాల కారణంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా 50 రోజులకు పైగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అందరూ ఇక తెలుగుదేశం పనై పోయిందన్న అనుకునే పరిస్థితులు ఆ ఐదేళ్ల కాలంలో ఏర్పడ్డాయి. అయితే  తెలుగుదేశం మాత్రం  అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయ్యింది. ప్రజల నమ్మకాన్ని గెలిచింది. వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడమే తరువాయి అన్న స్థితికి చేరింది. 

అయితే ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనడం, సంక్షోభాల నుంచి బయటపడటం ఆ పార్టీకి కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంక్షోభాలను ఎదుర్కొంది.   అలా ఎదుర్కొన్న ప్రతి సారీ   వాటిని అధిగమించి నిలబడింది.  ప్రజామన్ననలు పొందింది.   బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటమి తరువాత ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో చూసిన తరువాత  తెలుగుదేశం విశిష్ఠత, పటిష్ఠతపై తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.  

పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత వంద రోజులలోనే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందా అనిపించేలా దిగజారింది.  పార్టీకి భవిష్యత్ లేదని ఆ పార్టీ సీనియర్ నేతలే బాహాటంగా చెబుతూ పక్క పార్టీలలోకి దూకేస్తున్న పరిస్థితి.  బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచే విషయంలోనూ, పార్టీ నేతలలో, క్యాడర్ లో నమ్మకం కలిగించడంలోనూ ఆ పార్ట అధినేత కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా, వారిపై తన ఏకపక్ష నిర్ణయాలను రుద్దిన కేసీఆర్కు  ఓటమి తరువాత పార్టీ నేతలెవరూ అండగా నిలిచేందుకు ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ దయనీయ స్థితికి ఎంపీ టికెట్‌ పొందిన అభ్యర్థి కూడా పార్టీని వీడటాన్ని మించిన నిదర్శనం ఏముంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు పదిహేనేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని విజయవంతంగా నడిపించగలిగారు.  ఈ క్రమంలో వైఎస్ఆర్, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిల నిరంకుశ పాలనను ఎదుర్కొన్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలనడానికి ఉదాహరణగా చంద్రబాబు నిలిస్తే.. ఒక నాయకుడు ఎలా ఉండకూడదు అనడానికి ఉదాహరణగా కేసీఆర్ నిలుస్తారని పరిశీలకులు ఉదాహరణలతో సహా విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజలతో ఉండి వారి విశ్వసనీయతను పొందిన నేత చంద్రబాబు అయితే... అధికారంలో ఉండగా జనం నీడ కూడా తనమీద పడకుండా జాగ్రత్తలు తీసుకుని.. ఎన్నికల సమయంలో ప్రసంగాలకే పరిమితమైన నేత కేసీఆర్ అని చెబుతున్నారు.