మరికొద్ది రోజుల్లో బట్టబయలు కాబోతున్న తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ బాగోతం!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చదువు కొన్నారా? చదువుకున్నారా? అన్న విషయం త్వరలో తేలిపోనుంది. వాస్తవానికి రాజకీయాలలో రాణించాలంటే, ఉన్నత పదవులను నిర్వహించాలంటే చదువుతో సంబంధం లేదు. పంచాయతీ బోర్డు సభ్యుడికైనా, ప్రధానికైనా కూడా విద్యార్హతలు మస్ట్ ఏమీ కాదు. అక్షరాస్యతతో సంబంధం లేకుండా ఎన్నికలలో పోటీ చేయవచ్చు. ప్రజలు ఓటేసి గెలిపిస్తే చాలు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని ఇలా ఏ పదవి అయినా పొందే అవకాశం ఉంటుంది. పదవులకు చదువులు, డిగ్రీలు అవసరం లేదు. అయినా కూడా రాజకీయ నాయకుల విద్యార్హతల విషయంలో తరచూ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి.  

 ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలపై వివాదం తెలిసిందే.  మోడీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద   ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  ప్రయత్నించి విఫలమయ్యారు పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారాన్ని పదే పదే అడిగి సమాచార కమిషన్ సమయాన్ని వృధా చేస్తున్నారని భావించిన న్యాయస్థానం అరవింద్ కేజ్రీవాల్‌ కు పాతికవేల రూపాయల జరిమానా విధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సహా పలువురు ముఖ్య నేతలకు సంబందించిన విద్యార్హతల విషయంలోనూ వివాదాలు, విచారణలు జరిగాయి. జరుగుతున్నాయి. ఆ జాబితాలో  ఆంధ్ర ప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని  సీతారాం కూడా ఉన్నారు.  

తమ్మినేని సీతారాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలోనే ఆయన నకిలీ డిగ్రి సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లుగా తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. అప్పట్లో ఆధారాలతో సహా వారు చేసిన ఆరోపణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో  సంచలనంగా సృష్టించాయి. తమ్మినేని సీతారాం డిట్రీ చదవలేదు.. చదవకుండానే  హైదరాబాద్‌లోని ఒక న్యాయ కళాశాలలో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో న్యాయశాస్త్రం విద్యార్ధిగా  చేరారు. ఈ అంశంపై ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ  తెలుగుదేశం నేత నర్సిరెడ్డి వివరాలు సేకరించారు. 

తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా, తమ్మినేని సీతారాం  విద్యార్హతలు ఏమిటన్న వివరాలు తెలుసుకుంటే అసలు విషయం బయట పడిందని తెలంగాణ టీడీపీ నేతలు అప్పట్లో పేర్కొన్నారు. తమ్మినేని డిగ్రీ చదవలేదు, కానీ, చదివినట్లుగా ఒక నకిలీ సర్టిఫికేట్ సంపాదించారు. ఆ నకిలీ సర్టిఫికేట్ అర్హతగా  లా కాలేజీలో ప్రవేశం పొందారు. ప్రవేశ దరఖాస్తుకు  ఆ నకిలీ సర్టిఫికేట్ జతచేసి  లా కళాశాలలో ప్రవేశం పొందారు. ఆయన ఏ స్టడీ సెంటర్లలో అయితే డిగ్రీ చేసినట్లు చూపించారో, ఆ స్టడీ సర్కిల్లో ఆయన  చదవ లేదని వెరిఫికేషన్ లో తేలిందని..  డిగ్రీ సర్టిఫికెట్‌లో చెప్పిన హాల్ టిక్కెట్ నెంబర్ కూడా లేదని నర్సిరెడ్డి చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని… నకిలీ డిగ్రీ సృష్టించి ఉంటే.. ఆయనపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.   

వాస్తవానికి తమ్మినేని సీతారాం డిగ్రీ చదవక పోయినా ఆయన స్పీకర్ కావడానికి ఎటువంటి అవరోధం ఉండదు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ఎటువంటి ఆటంకం ఉండదే. అయితే వివాదం ఏమిటంటే ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో  తప్పుడు సమాచారం ఇచ్చారన్నదే. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచింది తప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ అని తేలితే మాత్రం ఆరేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హత వేటు పడుతుంది.  

ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం   డిగ్రీ నకిలీ సర్టిఫికెట్ తో హైదరాబాదు, ఎల్బీనగర్ లో గల మహాత్మా గాంధీ  లా కాలేజీలో మూడు సంవత్సరాల లా డిగ్రీ అడ్మిషన్ పొందారంటూ 2022లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు అందింది. దానిపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పై విచారణ చేయాల్సిందిగా లేఖ కూడా వచ్చింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. దీంతో తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో సహా రాష్ట్రపతి కార్యాలయం నుంచి విచారణ జరపాల్సిందిగా అప్పటి ప్రభుత్వ సీఎస్ కు వచ్చిన లేఖను పొందుపరిచి ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ కు  అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సాధికార కమిటీ కన్వీనర్ పల్లి సురేష్ లు తాజాగా  ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ స్పీకర్  తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ వ్యవహారంపై   విచారణ జరగనుంది. ఆయన చదువు కొన్నారా, చదువుకున్నారా అన్నది త్వరలో బయటపడనున్నది.