తలసాని రాజీనామాపై రాజ్ భవన్ లేఖ.. కేసీఆర్ ఏం చేస్తారు?

తలసాని రాజీడ్రామాపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తలసాని టీడీపీ పార్టీ నుండి గెలుపొంది రాజీనామా చేయకుండా తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తలసాని రాజీనామా చేయలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తాను రాజీనామా చేశానని.. దానికి సంబంధించిన రాజీనామా పత్రం నా దగ్గరే ఉందని.. కానీ అది స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉందని కబుర్లు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే టీడీపీ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ కు కూడా ఫిర్యాదు చేశారు.

అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏమైనా చిక్కులు వస్తాయా అని అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే ముందునుండి తెలంగాణ ప్రభుత్వం తలసాని రాజీనామా పై చూసిచూడనట్టే వ్యవహరిస్తుంది. ఇది కోర్టు పరిధిలోకి రాదని.. తమ పరిధిలోకి వస్తుందని వాదిస్తోంది. అయితే ఇప్పుడు తలసాని రాజీనామాపై రాజభవన్ నుండి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఓ లేఖ అందింది. తలసాని రాజీనామాపై వివరణ కోరుతూ లేఖను రాశారు. అంతేకాదు ఈ లేఖతో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాసిన లేఖను కూడా జత చేసి పంపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ లేఖ రావడం సర్వత్రా చర్చాంశనీయమైంది. ఈ లేఖపై కేసీఆర్ ఏవిధంగా స్పందిస్తారూ.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆసక్తికరంగా మారింది.