తెలంగాణాలో ఆక్సిజన్ స్పీడ్..
posted on May 8, 2021 9:45AM
దేశం అంతటా ఆక్సిజన్ కొరత ఉంది. తెలంగాణాలో కూడా ఆ ఆక్సిజన్ కొరత లేకపోలేదు. సకాలంలో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది ఆ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల నుండి ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటుంది. అందుకు సంబందించిన పనులను వేగవంతం చేస్తుంది.
తెలంగాణలో మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాను వేగవంతం చేయడంతో పాటు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా శాఖ, టీఎస్‌ఆర్టీసీ అధికారులతో బీఆర్కే భవన్‌లో సీఎస్ సమావేశమయ్యారు. ఒడిషాలోని అంగూరు, కర్ణాటకలోని బళ్లారి నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా వేగవంతంగా జరిగేలా నిపుణులతో బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో చర్చించి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ ఛానల్ సదుపాయం కల్పించేలా చూడాలన్నారు. తద్వారా రవాణాకు పట్టే సమయం ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గుతుందని సీఎస్ తెలిపారు.
మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు మెకానిక్స్, ఇతర నిపుణులను కూడా పంపాలని సూచించారు. కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ల ద్వారా సులువుగా తరలించేలా ట్యాంకర్లకు అవసరమైన మార్పులు చేయాలన్నారు. ట్యాంకర్ల రవాణా ప్రక్రియ నిరంతరం సాఫీగా సాగేలా డ్రైవర్లు, మెకానిక్స్‌తో బృందాలను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 30 ట్యాంకర్లకు అదనంగా ప్రైవేటు గుత్తేదార్ల నుంచి అదనపు ట్యాంకర్లను సమకూర్చుకోవాలని సీఎస్ ఆదేశించారు.