టీ20 వరల్డ్ ముందు భారత్‌కు షాక్...కీలక ప్లేయర్ దూరం
posted on Jan 8, 2026 8:11PM
.webp)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2006, న్యూజిలాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌లు ముంచుకొస్తున్న తరుణంలో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో మంచి ఫాంలో ఉన్న యువ బ్యాట్స్‌మన్ తిలక్‌వర్మకు పొట్ట కింద భాగంలో గాయమవ్వడంతో అతనికి ఆపరేషన్ చేశారు. తిలక్ కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందని వైద్యులు వెల్లడించారు.
ఆ క్రమంలో ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ 20 సిరీస్‌కు ఆ హైదరాబాదీ క్రికెటర్ దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లో జరుగుతున్నాయి. హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తుండగా ఇటీవల అతనికి పొట్ట కింద భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే స్కానింగ్ చేయించారు.
డాక్టర్ల సూచన మేరకు తిలక్‌కు తక్షణం సర్జరీ చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే 3, 4 వారాలు ఆటకు దూరమవ్వనున్నాడు. ఫలితంగా కివీస్‌తో సిరీస్‌కు ఆ యువ బ్యాట్స్‌మాన్ అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో ఇప్పటివరకు మరొకరికి జట్టులోకి తీసుకోలేదు.
ఏదేమైనా కొంతకాలంగా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న తిలక్ టీ20 ప్రపంచ కప్ ముందు గాయపడటం టీమ్‌ఇండియాకు భారీ దెబ్బ. అతడు వరల్డ్ కప్‌లో ఆడినా ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. పాకిస్థాన్‌తో జరిగిన 2025 ఆసియా కప్ ఫైనల్లో ఈ హైదరాబాదీ బ్యాటర్ అదరగొట్టాడు. 53 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.