గవర్నర్ ను కలిసిన టీ కాంగ్రెస్ నేతలు.. టీ సర్కార్ పై ఫిర్యాదు
posted on Jan 8, 2016 12:18PM

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ మొత్తం గులాబీ మయం అయిపోయింది. అధికారపార్టీ నగరమంతా పెద్ద హోర్డింగులతో నింపేసింది. దీనికి గాను ప్రతిపక్షాలు అధికార పార్టీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉభయ రాష్ట్రాల గవర్నర్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. గ్రేటర్ ఎన్నికలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గవర్నర్ కు నేతలు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డదారి తొక్కుతోందని.. ప్రభుత్వం 2000 హోర్డింగులు ఏర్పాటు చేసిందని, ఇందుకోసం రూ.450 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అధికార టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియ చేపడుతున్నారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, దానం నాగేందర్ తదితరులు ఉన్నారు.