జగన్ పైన సానుభూతి.. ఒక్క సీటుతోనే టీఆర్ఎస్
posted on May 29, 2019 2:26PM

టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సభలో అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో జగన్ పైన సానుభూతి పని చేసిందని.. అంతే కానీ టీడీపీ పైన ప్రజల్లో కోపం లేదని అన్నారు. పార్టీ నేతలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
"రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పని చేశాం. రాజధాని నిర్మాణ పనులు వేగంగా చేపట్టాం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా చాలా చేశాం. కానీ, ప్రజల అంచనాలు వేరుగా ఉన్నాయి. అయినా 39.2శాతం ఓట్లు రాబట్టాం." అన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని.. వారు ఏ రకంగా తమ హామీలు అమలు చేస్తారో.. పాలన ఏరకంగా చేస్తారో చూడాలని.. ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషిద్దామని చంద్రబాబు సూచించారు. "ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ముగ్గురు మినహా అందరూ గతంలో పనిచేసినవారే. పాత, కొత్త కలబోతతో వాణిని బలంగా వినిపించాలి. ఆయా నియోజకవర్గాల సమస్యలను సభలో ప్రస్తావించాలి. సకాలంలో పరిష్కారమయ్యేలా శ్రద్ధ వహించాలి" అని చంద్రబాబు సూచించారు.
ఇదే సమయం లో చంద్రబాబు టీఆర్‌ఎస్ పైనా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఒక్క సీటుతో ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్.. నేడు రెండోసారి కూడా అధికారం చేపట్టిందని గుర్తుచేశారు. టీడీపీ ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటుందని స్పష్టం చేసారు. నిత్యం ప్రజల్లో ఉండే టీడీపీ మళ్లీ భవిష్యత్తులో పుంజుకుంటుందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుదామని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.