న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగింపు!

సాధారణంగా కోర్టుల్లో వుండే న్యాయదేవత (లేడీ ఆఫ్ జస్టిస్) విగ్రహం కళ్ళకు నల్లటి రిబ్బన్‌తో గంతలు కట్టి వుంటాయి. సినిమాల్లో అయితే ఆ కళ్ళ గంతలను పదేపదే జూమ్ వేసి మరీ చూపిస్తూ వుంటారు. చట్టానికి చెవులే తప్ప కళ్ళు వుండవనే మాటకి అనుగుణంగా కళ్ళకు గంతలు కడతారు. దీన్ని ఆధారంగా చేసుకుని ‘‘చట్టానికి కళ్ళులేవు తమ్ముడూ’’ అంటూ సినిమా కవులు పాటలు కూడా రాసేశారు. కళ్ళకు గంతలు, చేతిలో ఖడ్గం ఇదీ న్యాయదేవత సమగ్ర స్వరూపం. అయితే ఇప్పుడు ఆ స్వరూపంలో మార్పు వచ్చింది. సుప్రీం కోర్టులో న్యాయదేవత విగ్రహం కొత్త మార్పులతో కనిపించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ న్యాయదేవత విగ్రహం స్వరూపాన్ని మార్చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో మార్పులతో కూడిన న్యాయదేవత విగ్రహం కనిపిస్తోంది. ‘‘చట్టం గుడ్డిది కాదు’’ అనే సందేశాన్ని ఇచ్చే విధంగా న్యాయదేవత కళ్ళకు కట్టి వుండే నల్ల రిబ్బన్‌ను తొలగించారు. అలాగే అన్యాయాన్ని శిక్షించడంలో ప్రతీకగా పేర్కొంటూ వస్తున్న న్యాయదేవత చేతిలోని ఖడ్గం స్థానంలో భారత రాజ్యాంగం వుంది. న్యాయదేవతకు మరో చేతిలో వుండే త్రాసును యథాతథంగా వుంచారు. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో ఈ కొత్త విగ్రహం కనిపించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌ ఆదేశాల మేరకు న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బ్రిటిష్‌ చట్టాలకు వీడ్కోలు పలికి కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో న్యాయ దేవత విగ్రహంలోనూ మార్పులు జరగాలని జస్టిస్ చంద్రచూడ్ గతంలోనే సూచించారు. ‘న్యాయదేవత కళ్ళకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడు గుడ్డిది కాదు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఖడ్గం హింసకు ప్రతీకగా కనిపిస్తోంది. అందువల్ల దానిని తొలగించాలి’’ అని అన్నారు.