అపర గజనీలా సజ్జల డ్రామాలు!

ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలన అంతా త‌ప్పుల‌మీద త‌ప్పులు చేయ‌డ‌మే, ప్ర‌తిప‌క్ష టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డమే అధికారం అన్నట్టుగా సాగింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో  వైసీపీ నేత‌ల్లో   వ‌ణుకు మొద‌లైంది. పోలీసుల అండ‌దండ‌ల‌తో రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తించిన ఒక్కొక్క‌రిపై కూట‌మి ప్ర‌భుత్వం గురిపెట్టింది. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకొని త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌పై ఇప్ప‌టికే కొర‌డా ఝుళిపిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం.. ఇక‌ నుంచి గ‌డిచిన ఐదేళ్ల‌లో అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రించిన వైసీపీ నేత‌ల అక్ర‌మాల‌ు, దాడుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌ల‌ను వెలికితీస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసుకు సంబంధించిన ద‌ర్యాప్తు వేగంగా కొన‌సాగుతోంది. వైసీపీ హ‌యాంలో కొంద‌రు ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలోకి వెళ్లి దాడికి పాల్ప‌డ్డారు. కార్యాల‌యంలో ఫ‌ర్నీచ‌ర్‌ను ధ్వంసం  చేశారు. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. అయినా, దాడికి పాల్ప‌డిన‌వారిపై వైసీపీ ప్ర‌భుత్వం ఏ   చ‌ర్య‌లు తీసుకోలేదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ కేసుకు సంబంధించి ద‌ర్యాప్తును ప్రారంభించింది. ఇప్ప‌టికే 65మందిని విచారించి 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో త‌న‌కు అరెస్టు నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఆయ‌న‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. 

టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విదేశాల‌కు వెళ్ల‌కుండా ఇప్ప‌టికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాల‌యంపై దాడి కేసులో వైసీపీ నేత‌లు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తల‌శిల ర‌ఘురామ్‌ల‌ను ప‌లు ద‌ఫాలుగా పోలీస్ స్టేష‌న్ కు పిలిచి విచారించారు. కేసు కొలిక్కి వ‌స్తున్న నేప‌థ్యంలో దాడి ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉన్న ముఖ్య నాయ‌కుల‌ను విచారించేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా స‌జ్జ‌ల‌కు మంగ‌ళ‌గిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో గురువారం (అక్టోబర్ 17) ఉద‌యం పదిన్నర గంట‌ల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో  విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసుల్లో స్ప‌ష్టం చేశారు. ఈ నోటీసుల‌పై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ‌తాన్ని మ‌రిచిన గ‌జ‌నీలా వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ హ‌యాంలో ఎవ‌రిపైనా దాడులు జ‌ర‌గ‌లేద‌న్న స‌జ్జ‌ల‌.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుందంటూ చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి వైసీపీ   ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌తిప‌క్ష నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌ర‌గ‌ని రోజు లేదని చెప్పొచ్చు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును క‌నీసం ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండానే అరెస్టు చేసి దాదాపు రెండు నెల‌లు జైల్లో పెట్టారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పైనా అక్ర‌మ కేసులు బ‌నాయించారు. తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లోని కీల‌క నేత‌లంద‌రిపై అక్ర‌మ కేసులు బ‌నాయించి వేధింపుల‌కు గురిచేశారు. 

2014-2019 మ‌ధ్య‌కాలంలో తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టిన దాఖ‌లాలు లేవు. కానీ, వైసీపీ హ‌యాంలో మాత్రం వంద‌ల మంది టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టారు. కొంద‌రిని అకారణంగా జైళ్ల‌కు పంపించారు. మ‌రికొంద‌రిని జైళ్ల‌లో హ‌త్య‌లు చేసేందుకు సైతం వైసీపీ అనుకూల పోలీసులు ప్ర‌య‌త్నించారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల ద‌గ్గ‌ర నుంచి సామాన్య ప్ర‌జ‌ల వ‌ర‌కు.. మొత్తంగా వైసీపీ అరాచ‌కాల‌ను ప్ర‌శ్నించిన ప్ర‌తి ఒక్క‌రిపై పోలీసులు అక్ర‌మ కేసులు బ‌నాయించి ఇబ్బందుల‌కు గురిచేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడుల‌కు పాల్ప‌డిన వారిపై కొర‌ఢా ఝుళిపిస్తోంది. అయితే, స‌జ్జ‌ల  తనకు నోటీసులు వచ్చే సరికి సుద్దపూసలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు పాలనలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని గ‌గ్గోలు పెడుతున్నారు. సుప్రీంకోర్టు తనకు ఇటీరియమ్ ప్రొటక్షన్   సెప్టెంబర్ 20వ తేదీనే ఇచ్చిందని.. అలాంటప్పుడు తనకు ఇప్పుడు నోటీసులు ఎలా ఇస్తారంటూ స‌జ్జల ప్ర‌శ్నించారు. త‌న‌ను త్వ‌ర‌లోనే అరెస్టు చేస్తార‌ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ స‌జ్జ‌ల భ‌యాందోళ‌న వ్య‌క్తం చేశారు. 

మీడియా స‌మావేశంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి భ‌యాన్నిచూసి వైసీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో స‌జ్జ‌ల‌, ఇత‌ర వైసీపీ పెద్ద‌ల మాట‌లువిని చ‌ట్టానికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించామ‌ని,  ఇప్ప‌డు  జైళ్ల‌కు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్న ఆందోళ‌న వైసీపీ నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి... టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌తో స‌త్సంబంధాలు పెంచుకొని ఆయా పార్టీల్లోకి వెడితే మేల‌న్న భావ‌న‌కు కొంద‌రు నేత‌లు వ‌చ్చేస్తున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి‌. ఐదేళ్ల పాల‌న‌లో ఏపీలో అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న బ్యాచ్   త్వ‌ర‌లోనే   కర్మఫలం అనుభవించక తప్పదన్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది.