డయాబెటిస్ ఉన్నవారు చెరకు రసం తాగవచ్చా..!


వేసవి కాలం వచ్చిందంటే పండ్ల రసాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది.  శరీరాన్ని చల్లబరిచి శరీరానికి శక్తిని ఇవ్వడం పండ్ల రసాల ప్రత్యేకత.  అయితే బయటకు వెళ్లినప్పుడు చాలా మంది ఎంచుకునే వాటిలో కొబ్బరి నీరు.. దాని తరువాత చెరకు రసం మొదటి వరుసలో ఉంటాయి.  చెరకు రసం శరీరానికి చలువ చేస్తుంది.  శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది.  వేసవి వేడి ప్రభావానికి గురి కాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.  అయితే చెరకు రసం తియ్యగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దాన్ని తాగవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.

డయాబెటిస్ లో రక్తం లో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలి.  ఇలా నియంత్రణలో ఉంచగలిగే ఆహార పదార్థాలను తీసుకోవాలి.  అలాంటి పానీయాలనే తాగాలి అని ఆహార నిపుణులు,  వైద్యులు చెబుతారు.  

చెరకు రసం శరీరానికి తక్షణ  శక్తిని ఇస్తుంది.  ఈ కారణంగానే చాలామంది బయటకు వెళ్లినప్పుడు అలసటగా అనిపించగానే చెరకు రసం తాగుతూ ఉంటారు.  దీని వల్ల శరీరం వేగంగా రీచార్జ్ కావడమే కాకుండా శరీరం  హైడ్రేట్ గా కూడా ఉంటుంది.  అందుకే చెరకు రసం ఆరోగ్యానికి మంచిదిగా పరిగణిస్తారు.

చెరకు రసంలో ప్రధానంగా సహజ చక్కెరలు ఉంటాయి.  ఇవి కూడా చాలా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి.  చెరకు రసాన్ని తాగినప్పుడు ఇందులోని సహజ చెక్కరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ప్రతి ఆహార పదార్థంలో ఉన్న చక్కెర శాతాన్ని గ్లైసెమిక్ సూచిక ద్వారా కొలుస్తారు.  చెరకు రసంలో ఉన్న గ్లైసెమిక్ సూచిక కూడా ఎక్కువగా ఉంటుంది.  అంటే ఇలా గ్లైసెమిక్ సూచిక ఎక్కువగా ఉన్న పదార్థాలు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి.

మధుమేహం ఉన్నవారు చెరకు రసాన్ని తాగాలి అంటే మొదట వారి రక్తంలో చక్కెర స్థాయిల పరిమాణాన్ని  పరిగణలోకి తీసుకోవాలి.  చక్కెర స్థాయిలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉంటే పర్వాలేదు. కానీ చక్కెర స్థాయిలు అప్పటికే ఎక్కువగా ఉన్నవారు పొరపాటున కూడా చెరకు రసం తాగకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా పెంచుతుంది.  దీని వల్ల ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. వైద్యుల సిఫారసు లేకుండా చెరకు రసం తాగడం మంచిది కాదు.

                                   *రూపశ్రీ

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...