ఇంటా బయటా ఉక్కపోతతో విజయసాయి ఉక్కిరిబిక్కిరి!
posted on Nov 18, 2024 2:36PM
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయికి ఇంటా బయటా ఉక్కపోత తప్పడం లేదు. విజయసాయిని ఇటు సొంత పార్టీకీ, అటు మీడియాకీ కూడా టార్గెట్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ప్రకటనలకూ, వ్యాఖ్యలకూ కనీసం జగన్ రెడ్డి సొంత మీడియాలో కూడా ప్రాముఖ్యత లభించడం లేదు. పార్టీ నేతలూ కార్యకర్తలూ కూడా ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదు. పోనీ ఇంత కాలం అవమానించినా, కాదు పొమ్మన్నా, పాపం ముసలోడైపోయాడంటూ చులకన చేసినా పెద్దగా పట్టించుకోకుండా, దులిపేసుకుని జగన్ పట్ల తన వీర విధేయతను శ్రద్ధంగా, భక్తిగా, భయంతో చాటిన విజయసాయిరెడ్డికి కనీసం జగన్ నుంచి కూడా సరైన గుర్తింపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే విజయసాయి ఇటీవల తరచుగా సంయమనం కోల్పోతున్నారు. మీడియాలో ఎక్కడా తన మాటలకు ప్రాధాన్యత లభించకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించి ఇష్టారీతిగా నోరు పారేసుకుంటున్నారు.
గతంలో కూడా ఒక సారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంతంగా చానల్, పత్రిక ప్రారంభించబోతున్నట్లు ప్రకటించేశారు. ఆ సందర్భంలో ఆయన మనసులో ఉన్న మాట అనుకోకుండా బయటకు చెప్పేశారు. వైసీపీలో కూడా తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందనీ, ఆ పార్టీ సొంత మీడియాలో కూడా తనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనీ ఆవేదన వ్యక్తం చేసేశారు. గతంలోనే తాను టెలివిజన్ చానల్ ప్రారంభిద్దామని అనుకున్నాననీ, అయితే అప్పట్లో జగన్ వారించడం వల్ల ఆగిపోయాననీ చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఎవరి చెప్పినా వినే పరిస్థితి లేదనీ, చానెల్ ప్రారంభించడం తధ్యమనీ కుండబద్దలు కొట్టేశారు. అంతే ఆ తరువాత ఆయన మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు.
అసలింతకీ విజయసాయిరెడ్డి ఆవేదనకు, ఆక్రందనలకూ కారణమేమిటంటే.. మొదటి నుంచీ వైసీపీలో నంబర్ 2గా ఉండే విజయసాయి రెడ్డికి ఆ తరువాత పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆయన నంబర్ 2 స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేశారు. ఆ తరువాత విజయసాయికి పార్టీలో నామమాత్రపు ఉనికి మాత్రమే మిగిలింది. ఆ సమయంలో ఆయన సొంత చానల్, సొంత పత్రికా అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటన చేశారు.
అన్నిటి కంటే ముఖ్యంగా విజయసాయిపై ఒక మహాళా అధికారితో అక్రమ సంబంధం ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో ఆయనకు మద్దతుగా వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఆరోపణలు ఖండించడానికి ముందుకు రాలేదు. దీంతో ఆయన ఇక పార్టీ అండ కోసం అర్రులు చాస్తూ కూర్చుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేసి సొంత మీడియా ఏర్పాటుపై ప్రకటన చేసేశారు. ఆ సమయంలోనే.. తాను ఏ పార్టీలో ఉన్నా తన చానల్ మాత్రం నిఖార్సైన వార్తలే ప్రసారం చేస్తుందని చెప్పి పార్టీ మార్పు సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ సంకేతం ఇవ్వడం ద్వారా జగన్ కు దాదాపుగా ఓ హెచ్చరిక చేశారు. లేదా బ్లాక్ మెయిల్ చేశారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.
నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీలో ఆయనను పట్టించుకునే నాథుడే కరవయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన సమయంలో కూడా ఆయనకు డిఫెన్స్ గా పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన సోంత చానల్ అంటూ హడావుడి చేశారు. ఇదంతా జరిగి ఐదు నెలలు కావస్తోంది. అయినా విజయసాయి చానెల్ ఏర్పాటు విషయంలో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక తాజాగా విజయసాయి రెడ్డి మరో సారి ఇక్కట్లలో పడ్డారు. ఆయన హద్దూ ఆపూ లేకుండా ఓ మీడియా సంస్థ అధిపతిపై చేసిన వ్యాఖ్యలకు ఆయన దీటుగా సమాధానం ఇచ్చారు. తన చానెల్ లోనే లైవ్ డిబేట్ కు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దీంతో విజయసాయి మళ్లీ సొంత చానల్ ప్రకటన చేసి, తన చానెల్ ద్వారానే ఆ మీడియా ప్రతినిథికి బదులిస్తానని చెప్పి ప్రస్తుతానికి తప్పించుకోవడం కోసం చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.