దేశంలో సైబర్ టెర్రర్.. బెంబేలెత్తిస్తున్న నేరగాళ్లు

దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.రోజూ ఎక్కడో అక్కడ బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షలు మాయం అయ్యాయని, బ్యాంక్ వారు చేతులెత్తేశారని వార్తలు వస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రతి వ్యక్తి చేతిలోకి వచ్చిన తరువాత. ఈ నేరగాళ్లు మరీ విజృంభించేస్తున్నారు. ఏదో మెసేజ్ రావడం దానిని క్లిక్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఖాలీ అయిందని వింటూ ఉంటాం.ఇటీవల మీ కేవైసీ చెక్ చేస్తున్నామని ఫోన్ రావడం,ఓటీపీ చెప్పమనడం వంటి నేరాలు కూడా పెరిగిపోయాయి. కరోనా తరువాత మనీ డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి.

కూరగాయల నుంచి  ప్రతి వస్తువు కొనుగోలు విషయంలోనూ డజిటల్ ట్రాన్సాక్షన్స్ కే జనం మొగ్గు చూపుతున్నారు. జేబులో డబ్డులు ఉంచుకోకుండా.. ఫోన్ ద్వారానే కొనుగోళ్లు కానిచ్చేస్తున్నారు.  ఉద్యోగుల వేతనాలు,ఇతర ఆదాయాలు బ్యాంక్ ఖాతాలోకి జమ కాగానే దానిని డిజిటల్ సౌకర్యంతో స్వేచ్ఛ గా ఖర్చు పెట్టుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వాలు  కూడా డిజిటల్ లావాదేవీలను  ప్రొత్సహిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీల  వల్ల పెద్ద నోట్లు దగ్గర ఉంచుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అలాగే చిల్లర లేదు అన్న బాధ కూడా పూర్తిగా తొలగిపోయింది.  దీంతో దేశంలో డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ కు జనం సులువుగా వేగంగా అలవాటు పడిపోయారు.  ఫోన్ నంబరు బ్యాంక్ అకౌంట్ కు అనుసంధానం చేయడంవల్ల డిజిటల్ లావాదేవీలు సులభమయ్యాయి.ఇది సైబర్ నేరగాళ్లకు ఓ అవకాశంగా మారిపోయింది. దీనికి తోడు ఆధార్   అన్ని బ్యాంకు అకౌంట్లకు సంధానం చేయడం కూడా సైబర్ నేరగాళ్లకు సులువుగా జనం ఖాతాలలోంచి సొమ్ము కాజేసే అవకాశాన్ని ఇచ్చింది.  వాట్సాప్,మెయిల్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేయడం సాధారణమై పోయింది.  

ఇలా సైబర్ నేరగాళ్ల వలలో పడటంలో ప్రజల అలక్ష్యం, అమాయకత్వం ఎంత కారణమో అంతకంటే ఎక్కువగా బ్యాంకు నిర్లక్ష్యం, ఆర్బీఐకి జవాబుదారీ తనం లేకపోవడం కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. డిజిటల్ మనీ ట్రాన్స్ ఫర్ల విషయంలో బ్యాంకులకు సొంత చెక్ వ్యవస్థ ఉండాలి. అలాగే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా  మనీ ట్రాన్స్ఫర్  విషయంలో ఒక అంతర్గత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయంలో బ్యాంకులు, ఆర్బీఐ అవసరమైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే సైబర్ నేరగాళ్లు ఆటలు సాగు తున్నాయి.అమాయక ప్రజల సొమ్ములు ఖాళీ అవుతున్నాయి.  సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా సైబర్ నేరాల అదుపులో బ్యాంకులు చేతులెత్తేయడం దౌర్భాగ్యమనే చెప్పాలి.