పసిప్రాణాన్ని మింగిన జగన్ నిర్లక్ష్యం!

జగన్ అధికారాన్ని చెలాయించిన రోజుల్లో చూపించిన నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు పేరుతో పాఠశాలలకు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించి అసంపూర్తిగా మధ్యలో వదిలేసింది. ఇలా మధ్యలో ఆగిపోయిన తరగతి గది లింటెల్, దాని మీద వున్న గోడ కూలి నెల్లూరు భక్తవత్సల నగర్‌ కేఎన్ఆర్ నగరపాలక పాఠశాలలో గురుమహేంద్ర అనే విద్యార్థి మరణించాడు. ఈ పాఠశాలలో 12 గదులను నిర్మించాలని పనులు ప్రారంభించారు. కానీ, ఆ పనులన్నీ రెండేళ్ళ క్రితం ఆగిపోయాయి. ప్రమాదకరంగా వున్న ఈ గదుల్లో విద్యార్థులు ఆటలు ఆడుకుంటున్నారు. ఊహించని విధంగా లెంటెల్, గోడ కూలిపోవడంతో గురుమహేంద్ర మరణించాడు. భవిష్యత్తు మీద ఎన్నో కలలతో చదువుకుంటున్న తమ కుమారుడు మరణించడంతో గురుమహేంద్ర తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ భవనాలు ప్రమాదకరంగా వున్నాయని గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు. 

విద్యార్థి మరణానికి దారితీసిన నిర్మాణంలో వున్న తరగతి గదులు, మొండి గోడలను డీఈఓ పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన కారణాలను కలెక్టర్, పాఠశాల విద్యా కమిషనర్, విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులకు వివరించారు. దుర్ఘటన మీద స్పందించిన కలెక్టర్ విద్యార్థి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ సంఘటన మీద మంత్రి నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, విచారణకు ఆదేశించారు. విద్యార్థి తల్లిదండ్రులకు అండగా వుంటామని హామీ ఇచ్చారు.