మునుగోడుతో మొదలు ముందున్నదంతా ఎన్నికల కాలమే
posted on Oct 16, 2022 9:49AM
తెలంగాణలో మునుగోడు అసెంబ్లీ స్థానం సహా, దేశంలో మరి కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఆరు అసెంబ్లీ, ఒకటి రెండు లోక్ సభ స్థానాలకు వచ్చే నెల, నవంబర్ 3 న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6 ఓట్ల లెక్కింపు.. ఫలితాలు. ఇక ఆ తర్వాత వారం రోజులు అయినా తిరక్కుండానే, నవంబర్ 12 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. ఇక అక్కడి నుంచి వచ్చే సంవత్సరం చివరి వరకు ఎన్నికలే ఎన్నికలు. ఈ 13 - 14 నెలల కాలంలో ఒకటి రెండు కాదు, ఏకంగా 11 రాష్ట్రల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే మునుగోడు ఉప ఎన్నికతో మొదలవుతున్న నిరంతర ఎన్నికల ప్రవాహం వచ్చే సంవత్సరం డిసెంబర్ లో జరిగే తెలంగాణ శాసన సభ ఎనికల వరకు కొనసాగుతూనే,,ఉంటుంది.
ఇలా వరసగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, భారాసగా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా ఎదిగేందుకు నూతన ప్రస్థానం ప్రారంభించిన తెరాసకు శుభ సూచకంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారాస బారసాల వేళా విశేషమేమో కానీ, గులాబి కారు రెక్కలు విచ్చుకునేందుకు 11 రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు స్వాగతం పలుకుతున్నాయి.అయితే, భారాస అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? పోటీ చేస్తే అన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తుందా? కొన్ని రాష్టాలకే పరిమితం అవుతుందా? అసలు పూర్తిగా పోటీకి దూరంగా ఉంటుందా ? అనేది ఆపార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అది వేరే విషయం. అవకాశం అయితే తలుపులు తడుతోందని ఎంతవరకు ఉపయోగించుకుంటారు అనేది గులాబీ బాస్ ఇష్టమని పరిశీలకులు భావిస్తున్నారు.
తెరాస, భారాస విషయాన్ని పక్కన పెడితే, రానున్న సంవత్సరం పై చిలుకు కాలంలో జరిగే 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నింటికీ పెద్ద పరీక్షగానే, భావించవలసి ఉంటుంది. ముఖ్యంగా, ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతోపాటుగా, వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగే, కర్ణాటక, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేశ భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని నిర్దేశిస్తాయని అంటున్నారు. ఇందులో రాజస్థాన్, తెలంగాణ మినహ మిగిలిన నాలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో వుంది. రాజస్థాన్ లో కాంగ్రెస్, తెలంగాణలో తెరాస అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండవ రాష్ట్రం ఛత్తీస్ గడ్ లోనూ 2023 డిసెంబర్ లో తెలంగాణతో పాటుగా ఎన్నికలు జరుగుగుతాయి.
అలాగే వచ్చే సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు ఈశాన్య రాష్ట్రాలలో నాలుగు రాష్ట్ర్లాలో బీజేపీ, బీజేపీమిత్ర పక్షాల సంకీర్ణ ప్రభుత్వాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో త్రిపుర కీలక రాష్ట్రంగా భావిస్తున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో తొలిసారిగా 2018లో కమల దళం కాషాయ జెండా ఎగరేసింది. ఎన్నికలు జరిగే 11 రాష్ట్రాలలో ఏడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ, ఉన్న రాష్ట్రాలను నిలుపుకోవడంతో పాటుగా, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాలలో పాగా వేసేందుకు, ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఒక రకంగా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే, సెమీఫైనల్ ఎలక్షన్స్ మోడీ షా జోడీకి సవాలుగా భావిస్తున్నారు. ఒక విధంగా మోడీ హ్యాట్రిక్ అవకాశాలను సెమీఫైనల్స్ నిర్ణయిస్తాయని అంటున్నారు. ఆ విధంగానూ నెక్ట్స్ ఇయర్ ఎలక్షన్స్ కీలకం కానున్నాయి.
అలాగే ప్రస్తుతం కేవలం రెండే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఈ పదకొండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, చతీస్ గఢ్ రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలలో అధికారం అందుకోవడం కీలకం కానుందని అంటున్నారు. ఒక విధంగా, రాహుల గాంధీ భారత్ జోడో యాత్రకు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక పరీక్ష కాగలవని అంటున్నారు.ముఖ్యంగా గుజరాత్, హిమాచల్ తో పాటుగా 2023 ప్రధమార్దంలో ఎన్నికలు జరిగే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం కానున్నాయని అంటున్నారు. రాహుల్ గాంధీ భాజో యాత్ర కర్ణాటకలో గట్టి ప్రభావాన్ని చూపిందని ప్రచారం జరుగతున్న నేపధ్యంలో రాహుల్ యాత్ర ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది,. అనే ప్రశ్నకు కర్ణాటక ఫలితాలు సమాధానంగా నిలుస్తాయి. అంతకంటే ముఖ్యంగా కాంగ్రెస్ కు కాబోయే కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కర్ణాటక కావడంతో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, ఆయన నాయకత్వానికి తొలి పరీక్ష కాగలవని అంటున్నారు. అందుకే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అటు రాహుల్ గాంధీకి, ఇటు ఖర్గేకి కూడా సవాలు కానున్నాయని అంటున్నారు.
అదలా ఉంటే, రానున్న రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ముఖ్యంగా. గుజరాత్ (182), రాజస్థాన్ (200) మధ్య ప్రదేశ్,(230) కర్ణాటక (224), ఛత్తీస్ గఢ్ (60)లలో ప్రధాన పోటీ బీజేపే, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. ఈ ఐదు రాష్ట్రాలలో కలిపి మొత్తం వందకు పైగా ( గుజరాత్ 26, రాజస్థాన్ 25, మధ్య ప్రదేశ్ 29 కర్ణాటక28, ఛత్తీస్ గఢ్ 11) లోక్ సభ స్థానాలున్నాయి. సో.. 2023లో జరిగే వరస అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలను కూడా ప్రతిబింబిస్తాయని చెప్పవచ్చును.