శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి వద్దు.. బోర్డు
posted on Oct 22, 2014 12:38PM
శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు కనీస స్థాయికి చేరాయి. ఆ నీటిని ఉపయోగించి ఇంకా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వెళ్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మంచినీటి సమస్య వచ్చే ప్రమాదం వుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నీటితో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ వుండటంతో నిలిపేయాల్సిందిగా సూచించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సూచనను ఖాతరు చేయకుండా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించింది. విద్యుత్ కేంద్రం వద్ద మిలటరీ పహారా పెట్టి మరీ విద్యుత్ ఉత్పత్తిని చేస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఇకపై శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని సూచించింది. శ్రీశైలం నీటిమట్టం విషయంలో గతంలో జరిగిన ఒప్పందాలకు రెండు రాష్ట్రాలూ కట్టుబడి వుండాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూనే వుంది.