ఏవి తల్లీ.. వలస పక్షుల కిలకిలారావాలు..?

వాటికి పాస్‌ పోర్ట్ అక్కరలేదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పర్మిషన్‌ అవసరమే లేదు.. భద్రతాదళ సిబ్బంది తనిఖీలతో అస్సలు పనేలేదు.. ఖండఖండాంతరాలు దాటివచ్చి నేలపట్టులో సందడి చేస్తాయి ఆ విదేశీ వలసపక్షులు. పక్షుల పండుగ వచ్చిందంటే అక్కడి వారికి పండుగే పండుగ. అయితే అంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగే ఈ పక్షుల పండుగ గత రెండేళ్లుగా బోసిపోయిందను చెప్పాలి. కోవిడ్ కారణంగా పర్యాటకుల రాక తగ్గిపోయినా... కొన్ని విదేశీ పక్షులు మాత్రం వచ్చి యధావిధిగా సందడి చేస్తున్నాయి. ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

నెల్లూరుజిల్లా నేలపట్టులో విదేశీ వలస పక్షులు కిలకిలారావాలతో సందడి చేస్తున్నాయి. రంగు రంగుల విదేశీ పక్షులు, రకరకాల వలస పక్షులు పర్యాటకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.‌ అయితే వాటిని చూసి, పరవశించే పర్యాటకులు రాకపోవడంతో నేలపట్టులో సందడి తగ్గిపోయింది. కనుచూపుమేర పచ్చని పొలాలు.. మరోవైపు జలకళ సంతరించుకున్న చెరువులు.. దట్టంగా పరుచుకున్న చెట్లు.. ఆ చెట్లకు తెల్లటి పూలు పూసినట్టు పక్షులు.. ప్రకృతి ప్రేమికులకు కట్టిపడేసే ఈ సుందర దృశ్యం నేలపట్టు ప్రత్యేకట. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం సుందర ప్రపంచంగా మారింది. ఆసియా ఖండంలోనే నేలపట్టు పెలికాన్ ప్యారడైజ్ గా ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ విడిదిచేసే పక్షులను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు, పక్షి ప్రేమికులు వస్తుంటారు. ఆదివారం.. ఇతర సెలవు రోజుల్లో పక్షులతో పాటు సందర్శకులతో నేలపట్టు కోలాహలంగా ఉంటుంది. అయితే.. ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా పర్యాటకుల రాక తగ్గిపోయింది.

ప్రతి సంవత్సరం అక్టోబరులో మనదేశంలోని హిమాలయాలు పొరుగున ఉన్న శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, కజికిస్థాన్, నైజీరియా తదితర దేశాల నుంచి పక్షులు నేలపట్టు పరిసరాలకు వస్తాయి. ఏప్రిల్ తొలి వారం వరకూ నేలపట్టులోనే ఉండి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని స్వస్థలాలకు తిరిగివెళతాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం నేలపట్టులో పక్షుల పండుగను అట్టహాసంగా నిర్వహిస్తుంది. గతంలో డిసెంబరు నెలాఖరులో కాని, జనవరి నెలలో కానీ ఈ పండుగను నిర్వహించేవారు. అయితే.. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో నేలపట్టు బోసిపోయింది. ప్రతి ఏటా అక్టోబర్‌ లో వచ్చే ఈ పక్షులను ఆయా దేశాలలో పెలికాన్స్.. వైట్ ఐ బీసా.. ఓపన్ బిల్డ్ స్టార్క్.. లిటిల్ కార్మోరెంట్స్.. కూడ్స్ అని రకరకాల ఆకట్టుకునే పేర్లతో పిలుస్తారు. మన అటవీశాఖ అధికారులు వాటికి గూడబాతులు.. తెల్లకంకణాలు.. నత్తగుల్ల కొంగలు.. నీటి కాకులు.. నీటి బాతులు అనే పేర్లు పెట్టారు. ఇలా 31 రకాల పక్షులు నేలపట్టు వచ్చి గుడ్లు పొదిగి.. తమ పిల్లలతో సహా తమ దేశాలకు ఎగిరిపోతాయి. నేలపట్టులో ఇప్పటికే కొన్ని రకాల పక్షులు తమ పిల్లలతో చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పక్షుల పండుగను మూడు రోజులు వైభవంగా నిర్వహించేది. బర్డ్‌ ఫెస్టివల్‌ ను రాష్ట్ర పండుగలో కూడా చేర్చడం విశేషం. అయితే రెండేళ్లుగా పక్షుల పండుగ అనే ఊసేలేదు లేకపోయింది. కరోనాను కారణం చూపించి పండుగను పక్కన పెట్టేశారు. ప్రభుత్వం కూడా పక్షుల పండుగ ఊసే ఎత్తకపోవడం ఏంటని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. నేలపట్టుకు వచ్చే సందర్శకులు మాత్రం పక్షుల పండుగ వాతావరణం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే.. పక్షుల పండుగను ఆస్వాదించే కొందరు నేలపట్టుకు వస్తూనే ఉన్నారు. ఏదైనప్పటికీ పక్షుల పండుగను ప్రభుత్వం నిర్వహించి ఉంటే బాగుంటుందని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.

నేలపట్టు పక్షుల కేంద్రానికి 25 ఏళ్ల క్రితం సుమారు 113 రకాలకు చెందిన రెండు లక్షల పక్షులు వచ్చి విడిది చేసేవి. పులికాట్ సరస్సులో ఆహారం సేకరించుకుని, సంతానాన్ని అభివృద్ధి చేసుకునేవి. కాలక్రమేణా నేలపట్టు వచ్చే పక్షుల సంఖ్య వేలల్లోకి తగ్గింది. గత ఏడాది 26 వేల 499 పక్షులు మాత్రమే వచ్చినట్లు గణాంకాలు ఉన్నాయి. ప్రస్తుతం 31 రకాలకు చెందిన 24 వేల 549 పక్షులు మాత్రమే విడిదిలో ఉన్నట్టు నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. విదేశీ పక్షులు తిరిగి తమ దేశాలకు వెళ్లే సమయం మరో రెండు నెలల ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ పక్షుల పండుగను వైభవంగా నిర్వహించాలని పక్షి ప్రేమికులు, స్థానికులు కోరుతున్నారు.