స్నేహితుడు గౌతమ్ కు జగన్ చిరు కానుక!

'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..’ అంటూ ఓ సినీకవి స్నేహం గొప్పదనం గురించి అద్భుతంగా వివరించారు. నిజమే.. సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అంటారు దాని విలువ తెలిసినవారు. అలాంటి స్నేహబంధానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఏపీ సీఎం వైఎస్ జగన్ స్నేహం పట్ల తనకున్న అపార విశ్వాసాన్ని చాటుకున్నారు. గుండెపోటుతో ఇటీవలే అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచిన తన ఆత్మీయ మిత్రుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి అసెంబ్లీలో ఘనంగా నివాళి అర్పించారు. తమ స్నేహానికి గుర్తుగా నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెట్టాలని, తద్వారా తన మిత్రుడి పేరును శాశ్వతం చేయాలని జగన్ నిర్ణయించారు. అంతేకాదు.. మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరిన మూడు కోరికలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ప్రజలు, ముఖ్యంగా గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గం ఆత్మకూరు ప్రాంత ప్రజలు, అభిమానులు, అనుచరులు జగన్ నిర్ణయాలతో ఎంతో సంతోషించారు.

స్నేహితులు అందరికీ ఉండవచ్చు. నేస్తాలు లేని వారు ఎవరూ ఉండకపోవచ్చు. చాలామంది స్నేహానుబంధాలు కాలక్రమంలో కరిగిపోవచ్చు. స్నేహితుల పట్ల తమకున్న అభిమానాన్ని కలకాలం మనసులో నిలుపుకోవడం ఏ కొద్దిమందికో సాధ్యమవుతుంది. అందులోనూ కొద్దిపాటి అధికారం లేదా పదవులు వచ్చినా చాలు.. బాల్యస్నేహితులు, పాతమిత్రులను మరిచిపోయే రోజులివి. అలాంటిది సీఎం స్థాయిలో ఉన్న జగన్ తనకు చిన్ననాటి నుంచి స్నేహితుడు, చిరకాల మిత్రుడైన గౌతమ్ ను మరచిపోలేకపోతున్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గౌతమ్ పేరు తలచుకుంటే చాలు..ఆయనతో తన స్నేహానుబంధాన్ని గుర్తుచేసుకుని బాధపడుతున్నారు జగన్. ఒక సీఎం తన స్నేహితుని పట్ల ఇంత అభిమానాన్ని.. ఆదరాన్నిచూపడం అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. మంచితనంతో.. మానవత్వంతో.. మచ్చలేని రాజకీయాలతో.. అందరికీ ఆదర్శంగా జీవించిన గౌతమ్ రెడ్డి వ్యక్తిత్వానికి ఇది మచ్చుతునక అంటున్నారు.

పరిశ్రమలశాఖ మంత్రిగా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకొచ్చిన యువనేత గౌతమ్ రెడ్డి ఉత్సాహాన్ని చూసి ఓర్వలేక మృత్యువు గుండెపోటు రూపంలో పొట్టనబెట్టుకుంది. తన మిత్రుడు ఇలా హఠాత్తుగా మరణించడాన్ని ఊహించలేకపోయారు సీఎం జగన్. వెంటనే హైదరాబాదులోని గౌతమ్ నివాసానికి సతీసమేతంగా వెళ్ళి, నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత ఆత్మకూరులో జరిగిన అంతిమయాత్రలో పాల్గొని తీరని వేదనతో కుమిలిపోతున్న కుటుంబ సభ్యులను ఊరడించి ధైర్యం చెప్పారు. కుటుంబ పెద్ద, తమ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన గౌతమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి దంపతులను ఓదార్చారు. గౌతమ్ రెడ్డి లేరనే ఊహే భరించలేకపోతున్నానని సీఎం ఆవేదనతో చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. గౌతమ్ రెడ్డి తనకంటే ఒక ఏడాది పెద్దవారని, అయినా తనను అన్నగా భావించి ఆత్మీయంగా ఉండేవారన్నారు.

గౌతమ్ రెడ్డి మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలు మరపురానివని, అలాంటి ఆత్మీయుడిని కోల్పోవడం తనకే కాదు.. రాష్ట్రానికి కూడా తీరని లోటు అని చెప్పారు. గౌతమ్ సంగం బ్యారేజీ అని నామకరణం చేస్తామని, త్వరలోనే సంగం బ్యారేజీ పూర్తిచేసి ప్రారంభిస్తామని సీఎం ప్రకటించడంతో గౌతమ్ రెడ్డి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గౌతమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరినట్లు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి గౌతమ్ పేరు పెట్టి వ్యవసాయం, ఉద్యాన రంగాల బోధనా కళాశాలగా ఏర్పాటుచేస్తామని ఉత్తమ కళాశాలగా తీర్చిదిద్దుతామని జగన్ పేర్కొనడం గమనార్హం. ఉదయగిని ప్రాంతానికి సాగునీళ్ళిస్తామని, ఉదయగిరి డిగ్రీ కాలేజీలో ‘నాడు-నేడు' పథకం కింద వసతులు పెంచుతామని సీఎం హామీ ఇవ్వడం శోకసంద్రంలో ఉన్న గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చినట్లయింది.

గౌతమ్ రెడ్డి భౌతికంగా లేకపోయినా.. ఆయన కోరుకున్న విధంగా వెనుకబడిన ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరిల్లో జరుగుతున్న అభివృద్ధి పథకాలను చూసి ఆయనకు జన్మనిచ్చిన గడ్డ గర్వపడుతోంది.