జగన్ బంధువు నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ బంధువు నివాసాలు కార్యాలయాలలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సోదాలు నిర్వహించింది. జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి సిట్ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన పోలీసు విచారణకు హాజరు కాలేదు. సిట్ గత నెల 28, 29 తేదీలలో ఇచ్చిన నోటీసులు ఇవ్వగా విచారణకు గైర్హాజరైన రాజ్ కసిరెడ్డి   తనకు సిట్ నోటీసులు పంపడాన్ని సవాల్ చేస్తూ హైకో ర్టును ఆశ్రయించారు.

అయితే కసిరెడ్డి రాజ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ నోటీసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో సిట్ ఆయనకు ఈ నెల 5న మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 9న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. అయితే కసిరెడ్డి రాజ్ ఈ సారీ విచారణకు డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాప్ ఉంది. దీంతో కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు నిర్ధారించుకున్న సిట్  అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఏపీ మద్యం కుంభోకోణం దర్యాప్తునకు కసిరెడ్డి రాజ్ ను విచారించి సమాచారం రాబట్టడం అత్యంత కీలకంగా సిట్ భావిస్తోంది. అతడి వద్ద నుంచి విలువైన సమాచారం రాబట్టి కుంభకోణం కేసుకు లాజికల్ ముంగింపు ఇవ్వాలని సిట్ భావిస్తోంది. ఇప్పటికే సిట్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులను విచారించి విలువైన సమాచారాన్ని సేకరించింది.