లోకనాయకుడు.. రాజ్యసభ సభ్యుడు..డీఎంకే పొత్తు ఫలితం!
posted on Apr 15, 2025 10:10AM
.webp)
ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం)అధినేత కమల్ హాసన్ త్వరలో చట్టసభలో అడుగుపెట్టనున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడు కానున్నారని ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు తంగవేల్ చెప్పారు. కోయంబత్తూర్‌లో సోమవారం (ఏప్రిల్ 14) తంగవేల్ కమల్ హసన్ కు రాజ్యసభ సభ్యత్వం దక్కనున్న విషయాన్ని వెల్లడించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోయంబత్తూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తంగవేల్, ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పారు.
ఆయన డీఎంకే మద్దతులో రాజ్యసభ కు ఎన్నికౌతారని చెప్పారు. ప్రస్తుతం సినీమా షూటింగ్ కోసం అమెరికాలో ఉన్న కమల్ హసన్.. జూలైలో రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు.
2021లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీ, అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు డీఎంకే కమల్ హసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యంకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించడానికి అంగీకారం తెలిపింది. ఇప్పుడు ఇద్దరు డీఎంకే రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జులైలో ముగియనుంది. దీంతో ఖాళీ అయ్యే ఆ రెండు స్థానాలలో ఒక స్థానం నుంచి కమల్ హసన్ ను రాజ్యసభకు పంపుతారని తంగవేల్ చెప్పారు. తన నటన ద్వారా లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హసన్ ఎంఎన్ఎం పార్టీని స్థాపించి రాజకీయాలలో క్రీయాశీలం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా చట్టసభలలో అడుగుపెట్టనున్నారు.