అంత కాంతి ఎందుకు బాబూ!

ఇప్పడు చాలా నగరాలలో పాతకాలపు ట్యూబ్లైట్ల బదులు ఎల్ఈడీలని అమర్చే ప్రక్రియ మొదలైపోయింది. చిన్నచిన్న దుకాణాలు మొదలుకొని పెద్ద పెద్ద మాల్స్ వరకూ ఎల్ఈడీలనే ఎక్కువగా వాడేస్తున్నారు. ఎల్ఈడీలని వాడటం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ కాంతి వచ్చే మాట వాస్తవమే! కానీ అంత కాంతి వలన లేనిపోని ప్రమాదాలు ఏర్పడతాయని హెచ్చరిస్తోంది అమెరికన్ మెడికల్ అసోసియేషన్. ఈ సంస్థ మాటలు విని, ఆ దేశంలోని 25 నగరాలు తమ వీధిదీపాలను మార్చేశాయి.


అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మొన్న జూన్లో విడుదల చేసిన ఒక నివేదికలో ఎక్కువ కాంతి ఉన్న ఎల్ఈడీ దీపాలను వాడటం వల్ల రకరకాల సమస్యలు ఉన్నాయంటూ పలు హెచ్చరికలు జారీచేసింది. ఒక నల్లటి వస్తువుని ఎంత ఉష్ణోగ్రత దగ్గర మండిస్తే అంతటి కాంతి వస్తుందో... దానిని కలర్ టెంపరేచర్ అంటారు. ఇది 3000 వరకూ ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ చాలా సందర్భాలలో 5000-6000 మధ్య ‘కలర్ టెంపరేచర్’ ఉండే ఎల్ఈడీ దీపాలను వాడేస్తున్నారని దుయ్యబట్టింది. వీటి నుంచి వెలువడే నీలపు కాంతి వల్ల ఏఏ సమస్యలు వస్తాయో తేల్చిచెప్పింది. వీరి నివేదిక ప్రకారం...

- కంటిలోని రెటినా దెబ్బతిని కంటిచూపు బలహీనపడే అవకాశం ఉంది.
- జీవగడియారపు వ్యవస్థ దెబ్బతిని నిద్రపోయే సమయాలలో విపరీతమైన మార్పులు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.
- క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశమూ లేకపోలేదు.
- వాహనాలను నడిపేవారు, ముఖ్యంగా వృద్ధుల కళ్ల మీద ఈ కాంతి నేరుగా పడటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు.
- వాతావరణంలోకి వెలువడే ఈ కాంతి కిరణాలు మనుషుల మీద కాకుండా పక్షులు, తాబేళ్లు వంటి జీవజాతుల మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
- ఒంటి మీద నేరుగా పడే ఇంతటి కాంతితో మనుషులు ఏదో పదిమంది కళ్ల ముందరా దోషిగా నిల్చొన్నట్లు అసౌకర్యానికి గురవుతూ ఉంటారు.


ఇన్నిరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి తక్షణమే అమెరికాలో వాడుతున్న వీధిదీపాలను తక్కువ స్థాయి ఎల్ఈడీలతో భర్తీ చేయమంటూ సూచించారు నిపుణులు. దాంతో అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఓ 25 నగరాలు తమ వీధుల తీరునే మార్చేశాయి. 3000 కలర్ టెంపరేచర్ లోపు ఉండే దీపాలను ఎంచుకున్నాయి. ఇప్పుడు హైదరాబాదులో కూడా 406 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి ఎల్ఈడీ వీధిలైట్లను నెలకొల్పాలని చూస్తున్నారు. మరి వారికి ఎల్ఈడీలతో వచ్చే దుష్ఫలితాలు, తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలిసే ఉంటాయని ఆశిద్దాం.

 

- నిర్జర