భోరున ఏడ్చిన కరుణానిధి
posted on May 21, 2015 9:45AM
ఉక్కులాంటి మనసున్న మనిషిగా పేరున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి భోరున విలపించారు. తొంభై సంవత్సరాల వయసు దాటిన ఆయనను అంతలా ఏడిపించిన అంశమేమిటో తెలుసా.... 99 సంవత్సరాల వయసున్న ఆయన అక్కయ్య షణ్ముగ సుందరత్తమ్మాళ్ మరణించడం. ఆమె బుధవారం నాడు మరణించారు. తన సోదరి మరణించారన్న వార్త వినగానే కరుణానిధి కన్నీటి పర్యంతం అయ్యారు. సుందరత్తమ్మాళ్ మరెవరోకాదు... కేంద్ర మాజీమంత్రి, దివంగత మురసోలి మారన్ తల్లి. తనకు ఎంతో ఇష్టమైన అక్క కొడుకు కాబట్టే తన మేనల్లుడు మురసోలి మారన్ అంటే కరుణానిధి ఎంతో ఇష్టపడేవారు. మురసోలి మారన్ సంతానం దయానిధి మారన్ కేంద్ర మాజీ మంత్రిగా, కళానిధి మారన్ సన్ గ్రూప్ అధినేతగా ప్రఖ్యాతిలోకి వచ్చిన విషయం తెలిసిందే. సుందరత్తమ్మాళ్ మరణించిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని దర్శించడానికి వచ్చిన కరుణానిధి విగతజీవిగా వున్న అక్కను చూడగానే భోరున విలపించారు. 99 సంవత్సరాల వయసున్న అక్క మరణిస్తే, 92 సంవత్సరాల వయసున్న కరుణానిధి విలపించడం... చూసేవారికి కొంత వింతగా అనిపిస్తున్నప్పటికీ, వారిమధ్య ఉన్న అనుబంధానికి కూడా ఇది నిదర్శనంగా నిలుస్తుంది.