ముఖ్యమంత్రి మాట్లాడడు, మంత్రులు నోర్లు విప్పరు, మీడియా రాయదు
posted on May 6, 2020 1:47PM
హైదరాబాదులోని కొత్తపేటలో ఉండే పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించిన సంగతి తెలిసిందే. కోహెడలో తాత్కాలికంగా షెడ్లను నిర్మించి పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేశారు. అయితే, గాలివాన బీభత్సానికి కోహెడ పండ్ల మార్కెట్ షెడ్ మొత్తం కూలిపోయింది. రేకులు ఎగిరిపడటంతో పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కనీసం రైతులని పరామర్శించలేదని కాంగ్రెస్ నేతలు విమరిస్తున్నారు. తాజాగా ఇదే ఘటనపై కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
"ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దది, ఆధునికమైనది అని చెప్పి, హడావిడిగా కనీసం ఇనుప రాడ్లను నట్టులు, బోల్టులతో బిగించకుండా, బట్టలతో కట్టిన షెడ్డు రైతుల, పండ్లు అమ్ముకునే వ్యాపారుల జీవితాల మీద కుప్పకూలిపోయింది. కొత్తపేట నుండి కోహెడకు తరలించిన పండ్ల మార్కెట్ దుస్థితి ఇది.
ఇంత పెద్ద ప్రమాదం జరిగినా సప్పుడు చెయ్యకుండా ఉంటరా? ఇది న్యాయమేనా? రైతుల మీద కరోనా కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
రైతుల గురించి ఎంతో గొప్పగ మాట్లాడుతారు...మరి ఇది న్యాయమేనా? వందలాది మంది రైతులు, పండ్ల విక్రయదారులు నష్టపోయారు. చాలా మందికి తీవ్రంగా గాయాలైనవి. ప్రాణాలు పోయినవారు ఉన్నరో లేదో ఇంకా తెలియలేదు. ఇంత జరిగినా ఒక్క మాట కూడా మాట్లాడకపోతే....మీ ప్రేమ రైతుల మీద ఉన్నట్టా లేక దీని వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఉన్నట్టా?
ఇప్పటి వరకు కనీసం ఆ షెడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ మీద కానీ, పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కానీ, నాయకుల మీద కానీ ఎటువంటి విచారణ లేదు, చర్య తీసుకోలేదు.
కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ భూముల మీద ఉన్న ప్రేమ రైతుల మీద ఉంటే...ఈ ప్రమాదం జరిగేది కాదు. కనీసం టాయిలెట్స్ లేకుండా ఆసియాలోనే అత్యాధునిక, అత్యంత పెద్ద ఫ్రూట్ మార్కెట్ నిర్మించిన ఘనులు. కోహెడ కు తరలించిన తరువాత రైతుల పంటకు ధరలు సగం కూడా వస్తలే. గిరాకీ లేక చిన్న వ్యాపారుల బతుకు ఆగం అయిపోయింది. అయినా ఈ విషయం మీద ఒక్క మాట మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడడు, మంత్రులు నోర్లు విప్పరు, మీడియా రాయదు. హాస్పిటల్ లో చావుబతుకుల్లో ఉన్న వారి ఏడ్పులు, మాటలు విన్న తర్వాతనైనా నమ్ముదాం.
ఇప్పుడు చెప్పండి తెలంగాణలో స్కామ్ స్టర్స్ ఎవరు? ఎవరు సామాన్యులను దోచుకుంటున్నది? రియల్ ఎస్టేట్ వ్యాపారం, కమీషన్ కోసం మామిడి పండ్ల సీసన్ లో హడావిడిగా మార్కెట్ ను కొత్తపేట్ నుండి కోహెడకు మార్చి, ఇటువంటి ప్రమాదకరమైన షెడ్డులు నిర్మించి పేద రైతుల, చిరు వ్యాపారుల బతుకులను చిదిమేస్తున్నది ఎవరు?" అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.