చావుకి 10... పెళ్లికి 20... మరి, వైన్‌షాప్‌ దగ్గర?

తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్‌ ఏరియాల్లో తప్ప రెడ్‌ జోన్లలోనూ బుధవారం నుండి లిక్కర్‌ షాపులు తెరచుకున్నాయి. పలు ప్రాంతాల్లో మందుబాబులు ఉదయం నుండే షాపుల ముందు బారులు తీరారు. మహారాష్ట్రలో, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మందు షాపులు ఓపెన్‌ చేసినప్పుడు... కరోనా వచ్చినా పర్లేదు. మందు లేకపోతే మనుగడ కష్టమన్నట్టు జనాలు ఎగబడ్డారు. భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తీసుకొంటూ మందు కోసం ఎగబడిన వీడియోలు ఇంటర్‌నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. పలవురు సినిమా సెలబ్రిటీలు మందు వాటిపై తమ స్పందన తెలిపారు. అవన్నీ చూసి తెలంగాణలో కేసీఆర్‌ లిక్కర్‌ షాపులకు ఎందుకు అనుమతి ఇచ్చారనేది కొందరు తలలు పట్టుకున్నారు. లిక్కర్‌ షాపులకు అనుమతి ఇవ్వడం తప్పని ‘నీదీ నాదే ఒకే కథ’ దర్శకుడు వేణు ఊడుగుల అభిప్రాయపడ్డారు.

‘‘చనిపోతే 10 మంది... పెళ్లికి అయితే 20 మంది... మరి, వైన్‌ షాప్‌ దగ్గర?’’ అని వేణు ఊడుగుల ట్వీట్‌ చేశారు. మందుషాపుల దగ్గర ఎంతమంది ఉండాలనేది ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. లిక్కర్‌ కోసం షాపుల దగ్గర వందల మంది పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. మనిషి మరణిస్తే చివరిచూపుకు, జీవితంలో ముఖ్యమైన వేడుక పెళ్లికి ఎక్కువమంది హాజరు కాకూడదని నిబంధనలు విధించిన ప్రభుత్వాలు... వైన్స్‌ దగ్గర ఎంతమంది ఉండాలో చెప్పలేదనే అంశాన్ని వేణు ఊడుగుల లేవదీశారు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించే అంశమే ఇది. షాపుకు వచ్చిన మందుబాబుల్లో ఒక్కరికి కరోనా ఉన్నా... మిగతా వాళ్లకు సోకే ప్రమాదం ఉంది.