సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ ఎనలిస్టు గోశాల ప్రసాద్ కన్నుమూత
posted on Jan 15, 2025 9:01AM
సీనియర్ జర్నలిస్టు గోశాల ప్రసాద్ కన్ను మూశారు. నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ హోదాలలో పలు మీడియా హౌస్ లలో పని చేసిన గోశాల ప్రసాద్ బుధవారం (జనవరి 15) ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. కాకినాడ ఆయన స్వస్థలం. భార్యా, కుమారుడు ఉన్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు ఆంధ్రప్రభలో వివిధహోదాల్లో పని చేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార పత్రిక ఆంధ్రప్రదేశ్ కు అసోసియేట్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తరువాత కొంత కాలం మిర్రర్ టుడే అనే సొంత పత్రిక నిర్వహించారు.
కాగా 2010-14 మధ్య కాలంలో అప్పటి మంత్రి ఆనం వద్ద, ఆ తరువాత 2014-16 మధ్య కాలంలో అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వద్ద పీఆర్వోగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరాధన పత్రిక కు ఎడిటర్ గా ఉన్నారు. అలాగే పలు ప్రముఖ టీవీ చానల్స్ లో టీవీ డిబేట్లలో విశ్లేషకుడిగా తనమైన ముద్ర వేశారు.
గోశాల ప్రసాద్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ విధ్వంస పాలనపై ధైర్యంగా గళమెత్తిన ధైర్యశాలి గోశాల ప్రసాద్ అని పేర్కొన్నారు. రాజకీయ పరిణామాలపై టీవీ చర్చల్లో లోతైన విశ్లేషణతో తనదైన ముద్ర వేశారని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.