రాజధాని అమరావతి కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
posted on Jan 7, 2026 12:11PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో అత్యంత కీలకమైన రెండో విడత ల్యాండ్ పూలింగ్ బుధవారం (జనవరి 7) మొదలైంది. రాజధాని ప్రాంతంలో రైల్వే ట్రాక్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడమే ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ లక్ష్యం. ఈ రెండో విడతలో భాగంగా బుధవారం (జనవరి 7) యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆరంభమైంది.
మొత్తం ఏడు గ్రామాల్లో దశలవారీగా అమలు చేయనున్న ఈ కార్యక్రమం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాలలో కొనసాగుతుంది. గుంటూరు జిల్లాలోని మూడు గ్రామాలు (వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి)లో 9,097.56 ఎకరాల పట్టా భూమి, 7.01 ఎకరాల అసైన్డ్ భూమి, అలాగే పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 7,465 ఎకరాల పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించనున్నారు.
ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను వచ్చే నెల 28 నాటికి పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేయనున్నారు.