కేసీఆర్ వెన్నంటే ఉండే ఆ ఎంపీ...దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాడట ?

 

తెలంగాణా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి భూములు కేటాయించిన విషయం మీద విమర్శలు చెలరేగుతున్నాయి. మిడ్‌ మానేరు ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీలో భాగంగా బీపీఎల్‌ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల) కోటా కింద టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతో్‌షకుమార్‌కు కొదురుపాకలోని సర్వే నం.317లో 242 గజాల స్థలాన్ని అధికారులు కేటాయించారు. 

ఆయనకే కాక ఆయన సోదరి జోగినిపల్లి సౌమ్యకు కూడా అదే సర్వే నంబర్‌లో 242 గజాల స్థలాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఈ కేటాయింపులు అక్రమంగా జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం 2008కి ముందు మూడు సంవత్సరాల నుంచి గ్రామంలో లేనివారికి పునరావాస ప్యాకేజీ వర్తించదని సంతోష్‌ హైదరాబాద్‌లో స్థిరపడి చాలా ఏళ్ళు అయ్యిందని అయినా అదేమీ పట్టించుకోకుండా పునరావాస ప్యాకేజీని అందించారని అక్కడి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామంలో పెళ్లయి అత్తారింటికి వెళ్లిన మహిళలెవరికీ అధికారులు పునరావాస ప్యాకేజీని వర్తింపజేయట్లేదని కానీ సంతోష్‌ సోదరికి మాత్రం ఎలా ఇస్తారనేది వారి ప్రశ్న. నిజానికి రాజ్యసభలో పేదోళ్లుంటారా ? ఉండచ్చు కాక అదీ ఏ కమ్మ్యూనిస్ట్ లో ఉంటారు. కానీ కేసీఆర్ వెన్నంటే ఉండే సంతోష్ దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబానికి చెందిన వాడంటే ఎవరైనా నమ్ముతారా ? కానీ అక్కడి అధికారులు నమ్మారు. వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏముంది అనే రీతిలో టీఆర్ఎస్ ఎంపీకి ఆ భూములు అప్పనంగా కట్టబెట్టారు. ఇప్పుడు ఇదే వ్యవహారం మీద అధికారులను ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu