ఉప్పు తింటే... తింటూ ఉండాల్సిందే!
posted on Apr 18, 2017 10:46AM
ఉప్పు లేని జీవితాన్ని ఊహించడం కష్టం. ఒంట్లో ముఖ్యమైన జీవక్రియలు జరగాలంటే ఉప్పు లోపలకి చేరాల్సిందే. కానీ అవసరం కోసం తినాల్సిన ఉప్పుని మోతాదుకి మించి తీసుకోవడం ఎక్కువైంది. ఫలితం.. ఒంట్లో నానా సమస్యలు మొదలవుతున్నాయి. ఈ సమస్యలన్నీ ఒక ఎత్తయితే... అసలు ఉప్పు తింటే మరింత ఆహారం తీసుకోవాల్సి వస్తుందని తేలడం మరో విచిత్రం!
జర్మనీలోని ఒక సంస్థ, అంతరిక్షంలో ఉండే వ్యోమగాముల శరీరం మీద ఉప్పు ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలించే ప్రయత్నం చేసింది. ‘ఉప్పు ఎక్కువ తినడం వల్ల వీలైనన్నిసార్లు మూత్రానికి వెళ్లక తప్పద’న్నది ఇప్పటివరకూ ఉన్న అభిప్రాయం. శరీరానికి ఎక్కువైన ఉప్పుని బయటకు పంపేందుకు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతరిక్షంలో ఇలాంటి పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది కదా! పైగా అక్కడ నీటి సమస్య కూడా ఉంటుందయ్యే! అందుకే వ్యోమగాములు తినే ఉప్పుకీ, వారి శరీరంలో జరుగుతున్న ప్రక్రియలకీ మధ్య ఉండే సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు.
పరిశోధనలో భాగంగా ఓ పదిమంది అభ్యర్థులను, వ్యోమనౌకలో ఉండే వాతావరణంలో ఉంచారు. వీరిలో కొందరిని 105 రోజులపాటు, మరికొందరిని 205 రోజులపాటు ఆ తరహా వాతావరణంలో ఉంచారు. వీరికి ఇచ్చే ఆహారంలో ఉప్పు మోతాదుని రెండుమూడు రకాలుగా మార్చిచూశారు. ఆశ్చర్యం! ఉప్పు ఎక్కువగా తినడం వల్ల నీరు ఎక్కువకాదు... తక్కువ తీసుకుంటున్నారని తేలింది. మరో వింత ఏమిటంటే... ఉప్పు ఎక్కువగా తినేవారు తమకు విపరీతంగా ఆకలి వేస్తోందంటూ తెగ తిన్నారట!
ఎక్కువ ఉప్పు తీసుకుంటే తక్కువ మూత్రం రావడం ఏమిటి? విపరీతంగా ఆకలి వేయడం ఏమిటి? అంటూ తలలు పట్టుకున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు ఇదే తరహా పరిశోధనను ఎలుకల మీద చేసి చూశారు. అప్పుడు బయటపడింది రహస్యం! శరీరంలో అధికంగా ఉన్న ఉప్పు మూత్రం ద్వారా బయటకు పోతున్న మాట వాస్తవమే. కానీ నీరు మాత్రం బయటకు వెళ్లకుండా తిరిగి కిడ్నీలలోకి చేరుకుంటోందట. ఒంట్లోని పనికిమాలిన ఉప్పుని ఎప్పటికప్పుడు సేకరించి బయటకు పంపేందుకు... శరీరం వీలైనంత నీటిని దాచుకుంటోంది!
ఉప్పుకీ, నీటికీ మధ్య సంబంధం తేలిపోయింది. మరి ఆకలి ఎక్కువగా వేయడానికి కారణం ఏమిటి? దీనికి ‘యూరియా’నే కారణం అని తేలింది. ఒంట్లోని నీరు మూత్రం ద్వారా బయటకు పోకుండా కిడ్నీలలోనే ఉండిపోయేందుకు యూరియా అవసరం అవుతుందట. ఈ యూరియాని ఉపయోగించుకోవాలంటే చాలా శక్తి అవసరం అవుతుంది. ఇందుకోసం ఎక్కువ తినాల్సి వస్తుంది!
ఉప్పు తింటే నీరు తక్కువగా తాగుతామనీ, తిండి ఎక్కువగా తింటామనీ.... ఈ పరిశోధనతో తేలిపోయింది. ఈ రెండూ కూడా ఒంటికి ఏమంత మంచిది కాదు కదా!!!
- నిర్జర.