సిడ్నీ ఉగ్ర దాడి నిందితుడు హైదరాబాద్ వాడే : డీజీపీ

 

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు జరిపిన నిందితుడు సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందిన వాడేనని తెలంగాణ డీజీపీ ఆఫీసు తెలిపింది. సాజిద్ 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. యూరప్‌కు చెందిన వెనెరా గ్రోసో అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. సాజిద్‌కి కుమారుడు నవీద్, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఆసీస్‌కు వలస వెళ్లినప్పటికీ, సాజిద్ ఇప్పటికీ హైదరాబాద్ నుంచి జారీ చేసిన భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 

ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కుటుంబ, ఆస్తి వ్యవహారాల నిమిత్తం సాజిద్ ఆరుసార్లు భారత్‌కు వచ్చినట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. 2017లో తండ్రి చనిపోతే హైదరాబాద్‌కు సాజిద్ వచ్చినట్లు పేర్కొన్నారు. 2022లో టోలీచౌక్‌లో ఉన్న ఆస్తులను అమ్ముకున్నారు. సాజిద్‌ కుమారుడు పాకిస్తాన్‌లో జన్మించినట్లు గుర్తించారు.

ఇటీవల సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24) విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్రమ్ హతమవగా, అతని కుమారుడు నవీద్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఇది ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రేరేపిత దాడి అని ఆస్ట్రేలియా అధికారులు భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu