అమెరికాలో రోడ్డు ప్రమాదం....ఇద్దరు తెలంగాణ యువతులు మృతి

 

అమెరికాలో మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వ రరావు కూతురు మేఘన, అలాగే ముల్కనూరుకు చెందిన కడియాల కోటేశ్వరరావు కూతురు భావన ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఉన్నత చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లిన ఈ యువతులు ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే మేఘన, భావనతో పాటు మొత్తం ఎనిమిది మంది స్నేహితులు కాలిఫోర్నియాలో టూర్‌కు వెళ్లారు. రెండు కార్లలో ప్రయాణించిన వారు టూర్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కాలిఫోర్నియా లోని అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో మేఘన, భావన అక్కడి కక్కడే మృతి చెందారు. ఇతరులు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఎంఎస్  పూర్తి చేసి మంచి ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు తోడుగా నిలవాలన్న ఆశలతో అమెరికాకు వెళ్లిన మేఘన, భావనల జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగియడం అందరినీ కలిచివేస్తోంది. 

రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే స్వస్థలాల్లో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన, భావన చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ చూపా రని, ఉన్నత ఆశయాలతో విదేశాలకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికా లో రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో తెలుగు విద్యార్థులు మరణిస్తున్న ఘటనలు పెరుగుతుండడం తో తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చోటుచేసుకున్న ఈ ప్రమాదం మరోసారి తెలుగు సమాజాన్ని కలచివేసింది. మృతుల మృతదేహాలను భారత్‌కు తరలించే ప్రక్రియపై కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు యువతుల అకాల మరణం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu