నెల్లూరు పెద్దారెడ్ల ప్రతిఘటన

కాలం కలిసి వస్తుంటే.. అన్ని ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి.. అదే కాలం కలిసి రాకుంటే.. ఒకదాని వెనుక ఒకటి పోతునే ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా  చోటు చేసుకొంటున్న పరిణామాలు చూస్తుంటే.. వైసీపీకి కాలం కలిసి రావడం లేదని అనిపించక మానదు. 

మొన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి.. నిన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నేడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి..  రేపు ఎవరు అనే  చర్చ జోరుగా సాగుతోంది. వీరందరూ ఒకరి వెంట ఒకరు వైసీపీపైనా, సీఎం జగన్ పైన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్‌నారాయణరెడ్డి గత కొంత కాలంగా సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గం ఇన్‌చార్జ్ బాధ్యతలను నేదురుమిల్లి రామ్‌కుమార్‌రెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం.  మరి కొద్ది రోజుల్లో ఆయన  తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమనీ, నేడో రేపో ముహూర్తం ఖరారు చేసుకుంటారని నెల్లూరులో విస్తృతంగా ప్రచారంలో ఉంది.  

అలాగే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..   జగన్ కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో..   తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ క్రమంలో తన ఆగ్రహాన్ని, అసహనాన్ని అధికారులపై చూపిస్తుండడంతో.. ఈ ఏడాది జనవరిలో సీఎం  జగన్ ఆయనను తన క్యాంప్ కార్యాలయానికి స్వయంగా  పిలిపించుకొని మరీ మాట్లాడి పంపించారు. అయితే గత కొద్ది రోజులుగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ.. సొంత పార్టీపై కోటంరెడ్డి నిప్పులు చెరగడమే కాదు..  అన్నా.. జగనన్న మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే... అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి,  జగన్‌కే సూటిగా ప్రశ్నలు సంధించారు. నమ్మకం లేని చోటు నేను  ఉండను గాక ఉండనంటూనే.. వచ్చే ఎన్నికల్లో  టీడీపీ నుంచి పోటీ చేస్తానని.. ఆ విషయం ఆ పార్టీ వారికే చెప్పానని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తాన్నారు. దీంతో కోటంరెడ్డి పార్టీ మార్పు పక్కా అని అందరికీ అర్థమైపోయింది. 
  
ఇక... ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం.. తన నియోజకవర్గంలో చోటు చేసుకొంటున్న తాజా పరిణామాలపై.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గమైన ఉదయగిరిలో పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డి.. చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఆతడి వల్ల మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇబ్బందులు పడుతున్నారు. పరిశీలకుడు ధనుంజయరెడ్డి నిర్ణయాల వల్ల .. పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ధనుంజయ్ రెడ్డి ససతం ఉదయగిరి ఎమ్మెల్యేపై తనదైన శైలిలో పెత్తనం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌కు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఫిర్యాదు చేశారు. అంతే కాదు తన మీద పెత్తనం చేయడం కదరని పని అని.. ఈ విషయం సీఎం జగన్, జిల్లా మంత్రి వద్ద తేల్చుకోవడానికే కాదు.... దేనికైనా సిద్ధమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  స్పష్టం చేశారు. 

ఇలాంటి వరుస పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని మరో ఎమ్మెల్యే.. అంటే మరో పెద్దారెడ్డి.. తన గొంతు సవరించుకొని.. అధికార పార్టీపై అసమ్మతి గళం విప్పి ఎదురు తిరిగేవారు ఎవరా? అని తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు సైతం టెన్షన్ పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో   ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో జగన్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. అలాంటి జిల్లాలో ఇలా   ఒకరి తర్వాత ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం ఎత్తడం విప్పుతూ పోతే.. ఇక మిగిలేది ఎవరిని.. అధికార పార్టీ పెద్దలు తలలుపట్టుకుంటున్నారు.