ధరణి రద్దుకే రేవంత్ సర్కార్ మొగ్గు!

మేం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తాం. భూమాత పేరుతో కొత్త పోర్టల్‌ను తీసుకొస్తాం ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి సహా ముఖ్యనేతలంతా  ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ దిశగానే రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నది. వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై, రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే ధరణి రద్దుపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అయితే  తొలుత ధరణిని పూర్తిగా రద్దు చేయడం కాకుండా, అవసరమైన మార్పులు చేర్పులూ చేసి పేరును మాత్రం భూమాతగా మారిస్తే సరిపోతుందా అన్న దిశగా కూడా రేవంత్ సర్కార్ యోచన చేసింది.  ఇందు కోసం ధరణి పునర్నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా ధరణి పోర్టల్‌లో పలు మార్పులు చేర్పులు చేయాలని సూచించింది.   ధరణి పోర్టల్‌ను రద్దు చేసి మళ్లీ పాత పద్ధతికి వెళ్లడం ప్రస్తుత డిజిటల్ యుగంలో సముచితం కాదని ప్రభుత్వం కూడా భావించింది. ధరణిని పూర్తిగా రద్దు చేసి కొత్త పోర్టల్‌ కోసం సాఫ్ట్‌వేర్‌ తయారీ, డాటా అప్‌లోడ్‌, సర్వర్లు, నిర్వహణ.. ఖర్చు సమయం వృధా చేయడం కంటే పోర్టల్ లోని లోపాలన సవరించి పేరు మారిస్తే సరిపోతుందని రేవంత్ సర్కార్ భావించింది. అయితే ధరణి పోర్టల్ తప్పుల తడకగా ఉండటం, చేయాల్సిన మార్పులు, చేర్పులు కొండవీటి చాంతాడంత ఉండటంతో ధరణి పోర్టల్ ను రద్దు చేయడమే మేలన్న నిర్ణయానికి రేవంత్ సర్కార్ వచ్చేసిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆర్వోఆర్ చట్టానికి సవరణల కంటే కొత్త చట్టాన్ని రూపొందించుకోవడం ద్వారానే భూ సేవలను మెరుగుగా నిర్వహించేందుకు వీలుంటుందని భావిస్తోంది. ఇందు కోసం ఈ నెల 24న జరగనున్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో వారితో చర్చించి, వారి అభిప్రాయాలను స్వీకరించి, పరిగణనలోనికి తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu