రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడనుందా?

పది సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా వుంటానని మొన్నామధ్య ఆత్మవిశ్వాసంతో ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ఊడిపోబోతోందా? ఈ ప్రశ్నకు ‘అవును’ అనే సమాధానం వస్తోంది. ఈ సమాధానం వస్తున్నది రేవంత్‌రెడ్డిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి పీఠం నుంచి కిందకి దించేయాలా అని ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ వర్గాల నుంచి కాదు.. రేవంత్‌రెడ్డి అద్భుతంగా పరిపాలిస్తున్నారంటూ మొన్నటి వరకు మురిసిపోయిన తెలంగాణ  కాంగ్రెస్ వర్గాల నుంచి! ‘హైడ్రా’ అనే పులిమీద ఎక్కి స్వారీ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించేయడానికి ఢిల్లీలో పావులు కదులుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి స్వారీ చేసిన పులి, త్వరలో ఆయన్నే తినేయబోతున్నాయని అంటున్నాయి. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కూల్చివేతలు చేపట్టడం, మూసీ సుందరీకరణ పేరుతో ఇళ్ళను కూల్చేయడానికి మార్కింగ్‌లు చేయడం.. ఇవన్నీ రేవంత్‌రెడ్డి మీద ప్రజల్లోను, కాంగ్రెస్ వర్గాల్లోనూ వ్యతిరేకత పెంచిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చెరువుల చుట్టూ బడాబాబులు కట్టిన కట్టడాలను కూల్చినప్పుడు ప్రజల్లో, కాంగ్రెస్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రజల బతుకులను రోడ్డు మీదకు తేవడం అతని పదవికే ఎసరు తెస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోకాలంపాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పేదల ఇళ్ళ జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు. ఎవరైనా అకస్మాత్తుగా ప్రభుత్వ భూములను కబ్జాచేసినట్టయితే, వాటిని తొలగించేవారు. ఒకవేళ  అలా తొలగించే పరిస్థితి లేకపోతే ఆయా ఇళ్ళను రెగ్యులరైజ్ చేసేవాళ్ళు. ఇలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నాలుగు ఇళ్ళు నిలబెట్టిందే తప్ప జనాన్ని రోడ్డుమీదకి నెట్టిన సందర్భాలు తక్కువ. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ కూల్చుడు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వున్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టే దిశగా మళ్ళిందని పలువురు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దానం నాగేందర్ లాంటి నాయకుడు కూడా బయటకి వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది.

ప్రజల ఇళ్ళ కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ పోతోందని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి ఫిర్యాదులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో మొదటి నుంచీ రేవంత్ రెడ్డి నచ్చనివాళ్ళు, గతంలో రేవంత్ రెడ్డి నచ్చినా, కూల్చివేతల తర్వాత రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నవారు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని జంట జలాశయాల పరిధిలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజుకు చెందిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చేసింది. అప్పటి నుంచీ రేవంత్ రెడ్డి మీద గుర్రుగా వున్న పల్లంరాజు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారికి అండాదండగా వుంటూ, కాంగ్రెస్ అధిష్ఠానానికి రేవంత్ రెడ్డి మీద ఇంప్రెషన్ పోయేలా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వ్యతిరేకుల వ్యూహం ఫలించినట్టయితే, అతి త్వరలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడిపోయే అవకాశం వుందని పలువురు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.