సాధారణంగా రాజకీయ ప్రముఖులు.. రాజకీయ ప్రముఖులు అనేమిటి ప్రముఖులెవరైనా సరే అనారోగ్యం పాలైతే వారిని వివిధ రంగాల ప్రముఖులు వారిని పరామర్శించడం చాలా సాధారణమైన విషయం. అదీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే అన్ని వర్గాల వారూ ఆయన యోగక్షేమాలను విచారించి, త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తారు. పరామర్శిస్తారు. ఇందులో వింత కానీ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం కానీ ఏమీ లేదు. ఎంతటి శత్రువైనా ఆసుపత్రిలో ఉంటే వారిని పలకరించి, పరామర్శించడమన్నది ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయం. అయితే రాజకీయాలలో ఆ ఆరోగ్యకరమైన సంప్రదాయం కనుమరుగై చాలా ఏళ్లయ్యింది.
మరీ ముఖ్యంగా కేంద్రంలో మోడీ సర్కార్, తెలుగు రాష్ట్రాలలో జగన్, కేసీఆర్ ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత, రాజకీయ శతృత్వం వ్యక్తిగత వైరంగా మరడాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు విద్యార్థులుగా స్నేహితులే అయినప్పటికీ రాజకీయం వారిని విడదీసింది. రాజకీయంగా ఇద్దరి దూరులూ వేరయ్యాయి. అయినా చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సలైట్ల దాడి జరిగినప్పుడు ఆ దాడిని వైఎస్ ఖండించారు. తిరుపతిలో ధర్నా నిర్వహించి మరీ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. అసెంబ్లీలో చంద్రబాబు, వైఎస్ ల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శల పరంపర కొనసాగేది. అయితే అవెప్పుడూ వారి వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేయలేదు. అప్పట్లో రాజకీయాలలో హుందాతనం అలా ఉండేది.
ఇప్పుడు పరిస్థితి మారింది. రాజకీయ ప్రత్యర్ధులు అనే మాట కనుమరుగై రాజకీయ శత్రువులు అన్న భావన ముందుకు వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీలు విపక్ష నేతలు, కార్యకర్తలపై అడ్డగోలు కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నాయి. రేవంత్‌రెడ్డిని కేసీఆర్.. చంద్రబాబునాయుడును జగన్మోహన్‌రెడ్డి జైళ్లకు పంపించిన ఉదంతాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలాగే కేంద్రంలోని మోడీ సర్కార్ విధానాలతో విభేదించే రాజకీయ పార్టీల నాయకులపైనే ఈడీ, ఐటీ, సీబీఐ నజర్ పెట్టడాన్ని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఇక ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన బాత్ రూంలో జారిపడి గాయపడి ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ఆస్పత్రిలో ఉన్న ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇప్పుడు అదే పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా శత్రువులా చూశారు. అలాగే వ్యవహరించారు. చివరకు కుమార్తె పెళ్లికి కూడా రేవంత్ రెడ్డి జైలు నుంచి వచ్చి చేయాల్సిన పరిస్థితి కల్పించారు. తన ఏకైక కుమార్తె పెళ్లి పనులన్నీ తాను దగ్గరుండి చూసుకోవలసిన రేవంత్ రెడ్డి అలా చేయలేకపోయారు. నిశ్చితార్థానికీ, పెళ్లికీ ఏదో అతిథిలా వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేలా చేశారు. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా రేవంత్ ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించడం, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం రాజకీయవర్గాలలోనే కాదు సామాన్యులలోనూ విస్మయం కలిగించింది. రాజకీయాలను పక్కనపెట్టి రేవంత్ హుందాతనంతో వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది. రేవంత్ పై ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఇక్కడే బీఆర్ఎస్ సంచుతిత్వం బయటపడింది. కేసీఆర్ ను పరామర్శించడానికి వెళ్లిన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఎన్నికల ముందే కారెక్కిన మాజీ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య చేసిన వ్యాఖ్యలు హుందాతనం మనలో ఉంటే సరిపోదు.. ఎదుటి వారిలోనూ ఉండాలి అనిపించేలా చేశాయి.
రాజకీయాలలో గెలపు ఓటములు సహజం. రెంటినీ సమానంగా తీసుకోవాలి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా సేవ, రాష్ట్ర ప్రగతి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. విపక్షంలో ఉంటే అధికార పక్షంపై అంశాల వారీగా విమర్శలు ఉండాలి. అయితే బీఆర్ఎస్ తీరులో అది కనిపించడం లేదు. ఓటమి తరువాత కేసీఆర్ కనీసం గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ను కనీసం అభినందించలేదు. మీడియా ముందుకు వచ్చి హుందాగా ఓటమిని అంగీకరించింది లేదు. అటువంటి కేసీఆర్ ను సీఎం హోదాలో రేవంత్ పరామర్శించారు. ఆ సందర్భంగా ఆస్పత్రి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేక నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే పోన్నాల లక్ష్మయ్య రేవంత్ పరామర్శపై చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి పరాకాష్టగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
‘‘దయచేసి నన్ను కనీసం ఏడాదైనా సీఎంగా ఉండనివ్వండి’’ అని రేవంత్‌రెడ్డి, మంచం మీద ఉన్న కేసీఆర్‌ను, చేతులెత్తి వేడుకున్నారని పొన్నాల చేసిన వ్యాఖ్య చౌకబారు-నేలబారు-మరగుజ్జు రాజకీయాలకు పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు.