దీపావళి ఆంక్షలు.. ఉల్లంఘాస్తే చర్యలు.. సీపీ శాండిల్య
posted on Nov 11, 2023 9:43AM
దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్పులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ శబ్ధాలు చేసే బాణాసంచ కాల్చడంపై నిషేధం విధించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహానగర ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు. జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో క్రాకర్స్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్న ఆయన రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే శబ్ధం చేసే క్రాకర్స్ కాల్చాలని సూచించారు.
నవంబర్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల మధ్య ఈ ఆంక్షలు అమలు అవుతాయని శాండిల్య తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.