ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదా.. ఇవే కారణాలు కావచ్చు..!
posted on Jan 31, 2025 9:30AM
.webp)
అధిక బరువు ఇప్పట్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో సహా చాలా రకాల కారణాలు బరువు మీద ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యం మీద స్పృహ పెరుగుతున్న నేటికాలంలో అధిక బరువును వదిలించుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడంలో ఫెయిల్ అవుతున్న వారే ఎక్కువ. జిమ్ చేసినా, నడక, వ్యాయామం, డైటింగ్.. ఇలా ప్రతిదీ బరువు తగ్గడానికి చేసే ప్రయత్నమే.. వీటి వల్ల ఫలితాలు రావడం లేదంటే దీని వెనుక ఇతర కారణాలు చాలా ఉంటాయి.
కేలరీలు..
బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు ఆహారం తీసుకోవడం లో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ రోజూ ఎన్ని కేలరీల ఆహారాన్ని తింటున్నారో అర్థం చేసుకోరు. ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నాం, ఎన్ని కేలరీలు శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేయగలుగుతున్నాం అనే విషయం చాలా మంది తెలుసుకోరు. ఇది బరువు తగ్గకపోవడానికి కారణం అవుతుంది. బరువు తగ్గాలి అంటే శరీరంలోకి వెళ్లే కేలరీలకు తగినట్టు శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేసే కేలరీలు కూడా ఎక్కువే ఉండాలి.
నిద్ర..
నిద్ర సరిగా లేకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత దెబ్బ తింటుంది. ఇది ఆకలిని పెంచుతుంది. బరువు తగ్గడాన్ని కష్టం చేస్తుంది. అందుకే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు రావాలి అంటే మంచి నిద్ర అవసరం.
నీరు..
నీరు శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. రోజూ కనీసం 3 లీటర్లకు పైగా నీరు తీసుకోవడం తప్పనిసరి. లేకపతే బరువు తగ్గడం కష్టం అవుతుంది.
ఒత్తిడి..
చాలామంది ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒత్తిడి అనేది మనిషి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఒత్తిడి వల్ల సరిగా నిద్ర పట్టకపోవడం, ఆహారం ఎక్కువగా తినడం, హార్మన్ల అసమతుల్యత, కోపం, చిరాకు, అసహనం వంటివి ఉంటాయి. ఇవన్నీ బరువు పెరగడానికి కారణం అవుతాయి.
కార్డియో..
బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తారు.అయితే వ్యాయామంలో కార్డియో వ్యాయామాలు మాత్రమే చేస్తుంటారు. కండరాలను బలంగా చేసే పనిపై దృష్టి పెట్టకపోతే జీవక్రియ వేగం మందగిస్తుంది. దీని వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉండదు.
ప్రోటీన్..
ఆహారంలో ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి. ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియను కూడా పెంచుతుంది. అందుకే ఆహారంలో ప్రోటీన్ తగ్గినా బరువు తగ్గడంలో ఫలితాలు కనిపించవు.
ఫైబర్..
ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండాలంటే ఫైబర్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు ఫైబర్ ఆహారాన్ని బాగా తీసుకోవాలి.
ఆరోగ్య సమస్యలు..
కొందరిలో ఆరోగ్య సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి సమస్యలు, ఏదైనా అనారోగ్య సమస్యతో మందులు వాడుతున్నవారు బరువు పెరుగుతారు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...