కేటీఆర్ లేఖాస్త్రాల లక్ష్యం అదేనా?

ఆ మధ్యన హుజూరాబాద్ పరాభవం తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం మీద కత్తులు దాశారు. మాటల తూటాలు పేల్చారు. ఇక యుద్దమే అన్నారు. వరన్నారు.. .. ఇదన్నారు ..అదన్నారు .. చివరకు అదేదో సినిమాలో .. ఇంతన్నాడు, అంతన్నాడు .. అన్న పాటలోలాగా  చివరకు తుస్సుమన్నారు. ఢిల్లీ వెళ్లి వట్టి చేతులతో వచ్చారు. అలాగే, కత్తులు కటారులతో పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళిన తెరాస ఎంపీలు కూడ మధ్యలోనే పలాయనం చిత్త గించారు. ఫ్లైట్ ఎక్కారు. అలాగే, ఆ ఎపిసోడ్’లో ఢిల్లీ వెళ్ళి మంత్రుల బృందం ... అటో ఇటో తేల్చుకుంటాం అంతవరకు ఢిల్లీలోనే కూర్చుంటామని మీడియా ముందు ప్రకటించిన గంటల్లోనే  ‘... చెప్పా పెట్టకుండా ఫ్లైట్’ ఎక్కి వచ్చేసింది. చివరకు, హుజూరాబాద్ పరాభవం లానే కేసీఆర్ సారధ్యంలో సాగిన  ‘వరి వార్’  కూడా ఒక ప్రహసనంగానే ముగిసింది. విమాన ఖర్చుల మందం ప్రయోజనం కూడా జరగలేదని పార్టీ ముఖ్యులే ఎగసెక్కాలాడుతున్నారు. 

అలాగే, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ, 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో భాగంగా బీజీపే రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంలోనూ  తెరాస ప్రభుత్వానికి శృంగభంగం తప్పలేదు. కోర్టు జోక్యంతో సంజయ్ రిలీజ్ అయ్యారు. మరో వంక బీజేపీ జాతీయ నాయకులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరసగా క్యూకట్టి రాష్ట్రానికి వచ్చి తెరాస ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ నెత్తిన అభాండాల బండలు వేసి వెళ్ళారు. బీజేపీ క్యాడర్’లో జోష్ పెరిగింది. మరో వంక ముఖ్యమంత్రి కేసేఆర్’ అరెస్ట్ తధ్యమనే సమాచారం మంత్రులు, తెరాస రాష్ట్ర నాయకులకు ఎక్కడినుంచి వచ్చిందో ఏమో కానీ, మంత్రులు కేసీఆర్’ని అరెస్ట్ చేస్తే భూమి బద్దలై పోతుందనే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో నిజనిజాలు ఎలా ఉన్నా మంట లేనిదే పొగ రాదని, ఏదో జరుగుతోందనే అనుమానాలకు అమాత్యులే ఆస్కారం కల్పిస్తున్నారు. ఇలా వరస పరభావలు ఎదురవుతున్నా,  దెబ్బ మీద దెబ్బ తగిలినా, తెరాస చిన్న బాసు, మంత్రి కేసీఆర్, ఢిల్లీఫై  మరో యుద్ధానికి సన్నద్ద అమ్వుతున్నారు. కేంద్రంపై  సంధించేందుకు కొత్త అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిని పార్లమెంట్‌లో 2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఇదే అదనుగా మంత్రి కేటీఆర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వరుసగా లేఖలు రాస్తున్నారు. కోర్కెల చిట్టాను చేరస్తున్నారు. వివిధ పథకాల పరిధిలో రాష్ట్రానికి దండిగా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. అదే సమయంలో ఇంతవరకు గడచిన ఏడేళ్ళలో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని పాత పాటనే వినిపిస్తున్నారు. అయితే, ఏడేళ్ళుగా రాష్ట్రంలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ‘బిల్డప్’ ఇచ్చి చివరకు కేంద్ర కొనకపోతే రాష్ట్ర కిలో కూడా కొనలేదని చేతులేత్తేయడంతో తెరాస ప్రభుత్వ బండారం బయట పడిపోయింది అనుకోండి. అది వేరే విషయం. 

అదలా ఉంటే, మంత్రి కేటీఆర్  కేంద్ర మంత్రికి రాసిన లేఖల్లో...నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ హైదరాబాద్‌ ఫార్మా సిటీ, ఎక్సెట్రాలకు   రూ.5 వేల కోట్లు, అలాగే వివిధ పారిశ్రామిక కారిడార్లకు మౌలిక సదుపాయాలకు ఇంకొన్ని వేల కోట్లు నిధులు..వాటికీ ఇన్నివేల కోట్లు.. వీటికి  ఇన్ని వేల   కోట్లు  కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్’ కు వరస పెట్టి లేఖలు రాస్తున్నారు. అ రాసిన ప్రతి లేఖను మీడియా ముందు ఉంచుతున్నారు.  

నిజమే, రాష్ట్రం కేద్రాన్ని నిధులు కోరడం తప్పు కాదు. అయితే, ఏ ఉద్దేశంతో కోరుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి, కేంద్ర నిధులు కోరుతున్నారా, లేక మేము అడిగిన కేంద్రం ఇవ్వలేదు అనే అభాండం వేసి రాజకీయ లబ్ది పొందేందుకు లేఖాస్త్రాలు సందిస్తున్నారా, అంటే  రెండవదే నిజం అనిపిస్తుంది. నిజానికి, కేంద్రం నిధులు తెచ్చుకోవాలనుకునే వారు అనుసరించే పద్దతులు వేరుగా ఉంటాయి. అంతే కానీ , ఇలా మీడియాకు ఎక్కి విమర్శలు చేయరని అంటున్నారు. ఇలా మీడియా ఎక్స్పోజర్ ముఖ్యమని అనుకుంటున్నారు అంటేనే, అందులోని రాజకీయం అర్థమవుతుందని అనుభవజ్ఞులు విశ్లేషిస్తున్నారు.

మరో వంక  రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్లు సహా చాలా వరకు సంక్షేమ పథకాలకు కేంద్రం నిందులు ఇస్తోంది, అలాగే,కేంద్రం ఇతరత్రా నిధులు ఇస్తోందని,   కానీ, రాష్ట్ర ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు విషయంలో లాగానే, నిజాన్ని దాచేసి, క్రెడిట్ మొత్తాన్నితమ ఖాతాలో వేసుకు కుంటోందే ,  కానీ, కేద్రానికి  పైసా క్రెడిట్ ఇవ్వడం లేదని బీజేపే నాయకులు అంటున్నారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా ఖర్చు పెట్టేది ప్రజల సొమ్మునే, వారి సొంత సొమ్ములు కాదు. అయితే, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు తమ కష్టార్జితాన్ని ధారపోస్తున్నట్లు చెప్పుకుంటారు. ఈ విద్యలో తెరాస నాయకులకు ఒక ఆకు  ఎక్కువే చదివారు అనిపిస్తుంది.అందుకే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కేసీఆర్,కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఉంటారు. అదే వారి అంతిమ లక్ష్యం. చివరకు ఈ ఆటలో.. ఎవరు .. గెలుస్తారో  ఏమో..