జనసేనాని కలిసింది వాళ్లనేనా? పవన్ ఢిల్లీ టూర్ పై రూమర్లు

 

జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన చడీచప్పుడు లేకుండా ముగిసిపోయింది. అలా వెళ్లారు... ఇలా వచ్చేశారు. అసలెందుకెళ్లారో... ఎందుకొచ్చేశారో కనీసం సమాచారమే లేదు. ప్రధాని మోడీ... కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరిగినా... అసలు కలిశారో లేదో తెలియదు. అసలు, మోడీ-షా అపాయింట్ మెంటే దొరకలేదని ప్రచారం కూడా జరిగింది. అయితే, అంత సడన్ గా పవన్ ఢిల్లీ వెళ్లాడంటే... బీజేపీ లేదా కేంద్ర పెద్దల పిలుపు లేకుండా వెళ్లడని అంటున్నారు. కానీ, ఢిల్లీలో ఎవరెవర్నీ కలిశాడో మాత్రం బయటికి రాలేదు. దాంతో, పవన్ ఢిల్లీ పర్యటనలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ కంటే వెయ్యిరెట్లు ఎక్కువగా జగన్ సర్కారుపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్... ఎన్నడూలేనంత ఘాటు విమర్శలే చేశారు. అయితే, ఇసుక కొరతపై విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్... నవంబర్ మూడులోపు ప్రభుత్వం స్పందించకపోతే, ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారమే పవన్ ఢిల్లీ వెళ్లొచ్చారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం ఇష్యూస్ పైనే పవన్ ఢిల్లీ వెళ్లొచ్చి ఉంటే... జనసేన ఎందుకు అధికారికంగా ప్రకటించలేదని అంటున్నారు.

జనసేనాని ఢిల్లీ టూర్ వివరాలను బయటపెట్టకపోవడంతో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ టీడీపీ ఎంపీలే... పవన్ ను ఢిల్లీ రమ్మన్నారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ సర్కారుపై పోరాడటానికి తన బలం సరిపోవడం లేదని... తనకు బీజేపీ పెద్దల మద్దతు కావాలంటూ వీళ్ల ద్వారా కాషాయ పెద్దలకు జనసేనాని విన్నవించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనతోపాటు ఏపీలో బీజేపీ బలపడాలంటే... జగన్ పై పరోక్షంగానో... ప్రత్యక్షంగానో... ఉమ్మడి పోరాటం చేయాల్సి ఉందని... అందుకు కేంద్రం అండ్ కాషాయ పెద్దల మద్దతు కావాలని కోరినట్లు చెబుతున్నారు. అయితే, పవన్ ఢిల్లీ పర్యటనపై రకరకాల రూమర్లు వినిపిస్తుంటే... జనసేన వర్గాలు మాత్రం అది పర్సనల్ టూర్ అంటూ సింపుల్ గా తేల్చేస్తున్నారు.