హరీశ్వర్‌రెడ్డి పార్టీ మార్పు ఎవరికి లాభం?

Ranga Reddy District, Parigi Constituency, Uneducated, No Development, TDP Candidate, K. Harishwar Reddy Won, Telangana Agitation, Harishwar Reddy To Join TRS, November 15th, TDP President Chandrababu Naidu,

 

రంగారెడ్డి జిల్లాలో అతిచిన్న నియోజకవర్గం పరిగి. ఇక్కడ లక్షా 99వేల పైచిలుకు జనాభా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. ఇంత చిన్న నియోజకవర్గం కూడా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కారణం పరిశీలిస్తే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కె.హరీశ్వర్‌రెడ్డి ఇక్కడ గెలుపొందటమే. పైగా ఈయనకు పెద్దగా మాట్లాడటమే రాదనే విమర్శలున్నాయి. అదృష్టవశాత్తూ ఇక్కడ గెలిచారని స్థానికులే ఈయన ఎన్నికపై ఆశ్చర్యపోతుంటారు. తనకు నచ్చిన పని మాత్రమే చేసే ఎమ్మెల్యేగా ఈయనకు పేరుంది. అందరినీ కలుపుకు పోయే తత్వం కొంచెం తక్కువ. అందు వల్ల హరీశ్వర్‌రెడ్డి తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడపలేకపోయారు. తన లోపాన్ని సన్నిహితులు కూడా ఎత్తిచూపుతున్న దశలో తెలంగాణా ఉద్యమం ఆయన్ని ఆకర్షించింది. ఎందుకంటే తన నియోజకవర్గంలోనూ స్వచ్ఛందంగా కొందరు ఈ ఉద్యమం వైపు పయనిస్తున్నారు. అందువల్ల తాను తెలంగాణాలో ఉన్నాడు కాబట్టి ఆ ఉద్యమం వైపు పయనించినట్లు నటిస్తే మరోసారి 2014 ఎన్నికల్లో విజయం సాధించవచ్చని కొందరు మేధావులు సూచించారు. పని చేయకపోయినా ఇటువంటి జాక్‌పాట్‌ కొట్టగలిగే అవకాశం తెలంగాణాప్రాంతంలో ఒకటి టిఆర్‌ఎస్‌, రెండు బిజెపిలకు మాత్రమే ఉందని కూడా తేలింది. దీంతో ఈయన టిఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపారు. అధికారం వదులుకోలేక పార్టీలు మార్చుకునే నేతల జాబితాలో ఈయన కూడా చేరిపోయారు. ఇటువంటి చేరికల వల్ల ఎటువంటి నష్టం తమ పార్టీకి ఉండదని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కప్పతక్కెడలను ప్రజలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారని ఆయన హెచ్చరించారు కూడా. తమ పార్టీలో హరీశ్వరరెడ్డి చేరుతున్నారని టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ కూడా ప్రకటించారు. నవంబర్‌ 15వతేదీ ముహుర్తమని ఆయన వివరించారు. అయితే నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు చూస్తున్నారో అన్న విషయం మర్చిపోయి స్వయంగా కేసిఆర్‌ వెళ్లి హరీశ్వరరెడ్డిని ఆహ్వానించారు. అంటే ఓ పార్టీ అధినేత అభివృద్ధిపై అంతగా అవగాహన లేని ఎమ్మెల్యేకు మరోసారి విజయమాల వేద్దామని చూస్తున్నారన్న మాట. ఓటర్లలో మార్పు వచ్చి ఆదరించకపోతే జరిగే నష్టం ఎవరికి? లాభం ఎవరికి? భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లోనే తేలాలి. అంత వరకూ టిఆర్‌ఎస్‌ తాను లాభపడ్డానన్న ఆనందం మిగలాలి కదా! ఆ తరువాతే అసలు విషయం అర్ధం అవుతుంది మరి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu