విచారణకు వర్చువల్ గా హాజరౌతా.. ఆర్జీవీ కొత్త ప్రతిపాదన

జగన్ అండ చూసుకుని అద్దూ ఆపూ లేకుండా  చెలరేగిపోయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అరెస్టు భయంతో వణికి పోతున్నారు. తాను సోషల్ మీడియా వేదికగా చేసిన అసభ్య, అసహ్య వ్యాఖ్యల కారణంగా పోలీసులు తనను అరెస్టు చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమోనని భయపడి ఛస్తున్నారు. అందుకే పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అతి తెలివి ఉపయోగించి వర్చువల్ విచారణకు హాజరౌతానంటూ ప్రతిపాదనలు పంపుతున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా, కుయుక్తులు పన్నినా రామ్ గోపాల్ వర్మ ఫిజికల్ గా విచారణకు హాజరు కాకుంటే అరెస్టు ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 

ఇక విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ వరుసగా రెండో సారి  కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారన్న వార్తలు సోమవారం (నవంబర్ 25) ఉదయం నుంచీ  గట్టిగా వినిపించాయి. అదుపులోనికి తీసుకుని ఒంగోలు తీసుకువెళ్లి విచారించే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు కూడా విశ్లేషణలు చేశారు. కట్ చేస్తే పోలీసులు రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకునే సరికే ఆయన అక్కడ నుంచి జారుకున్నారు. కోయంబత్తూరులో ఏదో సీని ఫంక్షన్ కో దేనికో వెళ్లారని తెలసింది. అయితే రామ్ గోపాల్ వర్మ చాలా తెలివిగా తన న్యాయవాదుల ద్వారా పోలీసులకు ఒక ప్రతిపాదన పంపారు. తాను  ప్రత్యక్ష విచారణకు హాజరు కాలేననీ, నాలుగు రోజుల తరువాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ లైన్ లో వర్చువల్ గా విచారణకు హాజరౌతాను అన్నదే ఆ ప్రతిపాదన.

అయితే రామ్ గోపాల్ వర్మ ప్రతిపాదన హాస్యా స్పందంగా ఉందన్న భావన సర్వత్రా వ్యక్తం అవు తోంది.నెటిజనులు ఈ ప్రతిపాదన చేసిన రామ్ గోపాల్ వర్మను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  తాను ప్రత్యక్షంగా విచారణకు హాజరవ్వడం వల్ల తనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు భారీ నష్టం కలుగుతుందంటూ సాకులు చెబుతున్న రామ్ గోపాల్ వర్మ చాలా డిస్పరేట్ గా అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అరెస్టు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని పరిశీలకులు అంటున్నారు.

ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు   రెండు సార్ల నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కావలసిందేనని రామ్ గోపాల్ వర్మకు స్పష్టం చేసింది. అరెస్టు చేయవద్దంటూ ఓ సారి, ముందస్తు బెయిలు కోసం మరో సారి రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఆ  రెండు సందర్భాలలోనూ కూడా  కోర్టు రామ్ గోపాల్ వర్మకు ఊరట కలిగించేలా ఉత్తర్వులు ఇవ్వలేదు. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను వాయిదా వేసింది. రెండు సందర్భాలలోనూ కూడా పోలీసుల విచారణకు హాజరు కావలసిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో  ఆయన వర్చువల్ హాజరు ప్రతిపాదనను పోలీసులు అంగీకరించే, ఆమోదించే పరిస్థితి లేదు. అంటే రామ్ గోపాల్ వర్మ పూర్తిగా చిక్కుల్లో పడ్డట్లేనని చెప్పవచ్చు. 

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే.. జగన్ కోసం సినిమాలు తీసీ, ఆయన కోసం సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పోస్టులు పెట్టీ ఇబ్బందుల్లో పడ్డ రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా ఇప్పటి వరకూ ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రాలేదు. ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ కనీసం ప్రకటనలు కూడా చేయలేదు. వైసీపీ రామ్ గోపాల్ వర్మను కూరలో కరివేపాకు కంటే హీనంగా తీసి అవతల పడేసింది. పార్టీ దృష్టిలో రామ్ గోపాల్ వర్మకు పూచికపుల్ల పాటి విలువ కూడా లేదని తన వైఖరి ద్వారా స్పష్టం చేసింది. 

ఇవన్నీ పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ నివాసానికి పోలీసులు చేరుకుంటే.. వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడకు చేరుకోలేదు. ఆయన నివాసం వద్దకు రామ్ గోపాల్ వర్మ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కనీసం నినాదాలు చేయడానికి కూడా వైసీపీ క్యాడర్ అక్కడకు చేరుకోలేదు. దీనిని బట్టే వైసీపీలో రామ్ గోపాల్ వర్మకు ఉన్న విలువ ఏమిటో ఇట్టే అవగతమౌతుంది. ఇలా ఉండగా ఒంగోలు పోలీసులు చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడే రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసి ఒంగోలుకు తరలించేందుకు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇప్పుడో మరి కొద్ది సేపటిలోనో  రామ్ గోపాల్ వర్మను అదుపులోనికి తీసుకునేందుకు చెన్నై పోలీసు బృందాలు కొయంబత్తూరుకు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.