జగన్.. బీజేపీ రహస్య మైత్రి ఇంకా కొనసాగుతోందా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నంత కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించారు. జగన్, బీజేపీల రహస్య మైత్రి అప్పట్లో ప్రతి సందర్భంలోనూ వెలుగులోకి వచ్చింది. జగన్ అరాచకాలను, అస్తవ్యస్త విధానాలనూ అప్పట్లో బీజేపీ అన్ని విధాలుగా సమర్ధించింది. సహకరించింది. ప్రోత్సహించింది. సరే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ అధినాయకత్వం తన వైఖరి మార్చుకుని జగన్ తో దూరం పాటిస్తోందని ఇంత కాలం, అంటే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత అందరూ భావించారు.

అందుకు తగ్గట్టుగానే ఏపీలో బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ అరెస్టునకు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో జగన్ కూడా బీజేపీపై, కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కాంగ్రెస్ కూటమికి చేరువ అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇతంతా ఉత్తిదేననీ, జగన్, బీజేపీల మధ్య మైత్రి దృఢంగా కొనసాగుతోందనీ తాజాగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా.. తాజాగా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చేసిన దిశానిర్దేశాన్ని చూపుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ మద్దతు ఇవ్వాలని ఎంపీలకు సూచించారని ఆ పార్టీ నేతలే చెప్పడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. 

సోమవారం (నవంబర్ 25) నుంచి వచ్చే నెల 20 వరకూ జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు మరీ ముఖ్యంగా బీజేపీకి అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అద్భుత విజయం ఆ పార్టీకి ఇచ్చిన ఉత్సాహంతో మోడీ, షాలు అజెండాలో లేకున్నా ఈ సమావేశాలలోనే జమిలి ఎన్నికల బిన్లును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ఈ బిల్లే కాకుండా విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్న వక్ఫ్ బోర్డు బిల్లును కూడా ఈ సమావేశాలలోనే ఆమోదింప చేసుకోవాలని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ ఆమోదం తెలపాలని జగన్ తన ఎంపీలకు సూచించారంటే.. బీజేపీతో ఆయన రహస్య మైత్రీ ఇంకా కొనసాగుతోందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని చెబుతున్నారు.  

లోక్ సభలో వైసీపీ మద్దతు, వ్యతిరేకతతో బీజేపీకి పెద్ద పట్టింపు ఉండదు కానీ, రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ నిలిస్తే ఆ పార్టీని ఒకింత ఇరుకున పెట్టే అవకాశం వైసీపీకి ఉంటుంది. అయితే ఆ మాత్రంగా కూడా బీజేపీకి ఇబ్బంది కలిగించేందుకు వైసీపీ అధినేత జగన్ సుముఖంగా లేరు. అలా వ్యతిరేకిస్తే అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుని జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురౌతుందని జగన్ ఇప్పటికీ భయపడుతున్నారు. అందుకే  బీజేపీకి మద్దతు ఇవ్వడానికే ఆయన ఇప్పటికీ మొగ్గు చూపుతున్నారు. బీజేపీని తాను వ్యతిరేకించకుంటే.. తనపై కేసుల విషయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం సహకారం ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి బీజేపీ ఏం చేస్తుందో?