ఇళ్ల నుంచి బయటికి రావొద్దు... హైదరాబాదీలకు జీహెచ్ఎంసీ వార్నింగ్

 

అతి భారీ వర్షాలు హైదరాబాద్‌‌ను ముంచెత్తడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక, రోడ్లపై నిలిచిన వర్షపు నీరును తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎక్కడికక్కడ రంగంలోకి దిగారు. అలాగే, జీహెచ్‌ఎంసీ కమాండ్‌ కంట్రోల్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తోన్న మేయర్ బొంతు రామ్మోహన్... రెస్క్యూ ఆపరేషన్స్‌ పై అధికారులకు, సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ దిశానిర్దేశం చేశారు.

అలాగే, జోరువానతో హైదరాబాద్‌‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుండటంతో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా రంగంలోకి దిగారు. జీహెచ్‌ఎంసీ అండ్ విద్యుత్‌శాఖాధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ, రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల దగ్గర జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

ఇదిలాఉంటే, ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణితో మరో రెండు మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దాంతో జీహెచ్‌ఎంసీ ముందజాగ్రత్త చర్యలు చేపడుతోంది. రెస్క్యూ టీమ్స్‌ను నిత్యం అందుబాటులో ఉంచుతోంది. అయితే, కుండపోత వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.