విజయవాడలో రైల్వే జోన్ ఏర్పాటుకి డిమాండ్
posted on May 27, 2015 9:56PM
మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టి ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్వయంగా రాష్ట్రానికి వచ్చి ఆంద్రప్రదేశ్ కి రైల్వే జోన్ మంజూరు చేసినట్లు ప్రకటిస్తారని సమాచారం అందుకోగానే దానిపై కూడా అప్పుడే రాజకీయాలు మొదలయిపోయాయి. రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని మొదటి నుండి అనుకొంటున్నదే. కనుక ఇక నేడో రేపో రైల్వే మంత్రి వచ్చి ఆ ప్రకటన చేయడమే ఆలశ్యమని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో దానిని విశాఖలో కాక విజయవాడ-గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయాలంటూ రైల్వే మజ్దూర్ యూనియన్ అదనపు కార్యదర్శి అవధానుల హరి డిమాండ్ చేసారు. రాజధాని అమరావతి దగ్గర రైల్వే జోన్ ఏర్పాటు చేసి, నల్లపాడు-బీబీనగర్ ల మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేసినట్లయితే ఆంద్ర, తెలంగాణా రాజధానులు మరింత బాగా అనుసంధానం అవుతాయని అన్నారు. అలాకాదని రాజకీయ కారణాలతో రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటుచేసినట్లయితే అది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని ఆయన వాదించారు. కొసమెరుపు ఏమిటంటే సురేష్ ప్రభు వచ్చేరు కానీ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించలేదు. దానిపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని త్వరలోనే శుభవార్త వింటారని ప్రకటించడంతో అందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటికే అనేక అంశాల మీద రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి కనుక ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియని ఆ రైల్వే జోన్ కోసం ప్రజలు వాదోపవాదాలు చేసుకోవడం రాష్ట్రానికి మేలు చేయదని అందరూ గ్రహించాలి.