ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ అమలయ్యేది ఎక్కడ?
posted on Oct 27, 2018 4:58PM

కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ డిమాండ్‌ను తమ ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని భాజపా చెప్పుకుంటోన్న విషయం తెలిసిందే.అయితే, ఇది సరిగ్గా అమలు కావట్లేందంటూ కొందరు మాజీ సైనికులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఢిల్లీలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో వారితో సమావేశమై, ఓఆర్‌ఓపీతో పాటు జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులు, సైనికుల సంక్షేమం వంటి అంశాలపై చర్చించారు.సమావేశ అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ..‘ఈ రోజు జరిగిన సమావేశంలో.. చాలా ఉపయోగపడే విషయాలను చర్చించాం. దీని ద్వారా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓఆర్‌ఓపీని ప్రధానమంత్రి మోదీ అమలు జరపడం లేదని, మాజీ సైనికులు స్పష్టంగా తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదు. దీనీ వల్ల మన జవాన్లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరోవైపు రఫేల్ ఒప్పందంలోని అవకతవకలు బయటపడుతున్నాయి. ఓ పారిశ్రామిక వేత్తకు మోదీ రూ.30,000 కోట్లు ఇచ్చారు.కానీ,దాని వల్ల దేశానికి ఏ ప్రయోజనమూ లేదు. మరోవైపు, మాజీ సైనికుల కోసం ఓఆర్‌ఓపీని మాత్రం అమలు చేయట్లేదు’ అని విమర్శించారు.
‘2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓఆర్‌ఓపీతో పాటు సైనికుల డిమాండ్‌లన్నింటినీ అమలు చేస్తుంది. రఫేల్ విషయంలో ఓ పారిశ్రామికవేత్తకు ఇచ్చిన రూ.30,000 కోట్ల కన్నా ఓఆర్‌ఓపీ అమలు చేయడానికి కేటాయించాల్సిన బడ్జెట్ తక్కువగానే ఉంటుంది’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.